Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ఆగష్టు 28వ తేదీ ఆదివారం జరగనున్న తెలంగాణ కానిస్టేబుల్ (Telangana Police Jobs) ప్రిలిమినరీ రాత పరీక్షకు (TS Constable Exams) ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు కూడా సిద్ధమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో కేఎస్ఎం కళాశాలలో పరీక్షా కేంద్రాల రీజనల్ కో-ఆర్డినేటర్స్,చీఫ్ సూపరింటెండెంట్స్, అబ్జర్వర్స్ మరియు పోలీసు అధికారులతో గురువారం అవగాహనా సమావేశం నిర్వహించారు. ఆగష్టు 28 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా సమయం ఉండగా...ఈ రాత పరీక్షకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ కొత్తగూడెం మరియు పాల్వంచ పరిధిలోని 39 పరీక్షా కేంద్రాలలో 14,221 మంది, భద్రాచలంలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాలలో 2,856 మంది అభ్యర్థులు ఈ రాత పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారానే అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించడం జరుగుతుందని ఎస్పీ వినీత్ స్పష్టం చేశారు. కొత్తగూడెం రీజియన్ నందు ఏర్పాటు చేసిన 39 పరీక్ష కేంద్రాలకు మైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ పున్నం చందర్, భద్రాచలం నందు ఏర్పాటు చేసిన 10 కేంద్రాలకు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య రీజనల్ కో-ఆర్డినెటర్స్గా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వివరించారు. 49 పరీక్షా కేంద్రాలకు 49 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ మరియు 49 మంది అబ్జర్వర్సుగా వ్యవహరించనున్నారు.
ఈ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఎస్పీ సూచించారు.కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని నియమ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
1. www.tslprb.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై నిర్దేశిత స్థలంలో అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగాఅతికించుకోవాలి.
2. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు బ్ల్యూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే వెంట తెచ్చుకోవాలి.
3. అభ్యర్థులు సెల్ ఫోన్, ట్యాబ్లెట్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైస్, చేతి గడియారం, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్స్ నోట్స్, ఛార్జ్,రికార్డింగ్ పరికరాలు, ఖాళీ పేపర్లను వెంట తీసుకురాకూడదు.
4. ఎలాంటి ఆభరణాలు ధరించరాదు. హ్యాండ్ బ్యాగ్, పౌచ్‌లు లాంటివి తీసుకురావద్దు. భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి క్లాక్రూములు ఉండవు.
5. బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థులు చేతివేళ్ళకు మెహంది, టాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరి
6. ఓఎంఆర్ షీట్స్ పై అనవసర రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.
7. పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఇంగ్లీష్ వర్షన్‌నే పరిగణలోకి తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Police jobs, Telangana