తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి 60 వేలకు పైగా అనుమతులు జారీ అయ్యాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు (Notifications) డిసెంబర్ మొదటి వారం నుంచి వరుసగా విడుదల కానున్నాయి. టీఎస్పీఎస్సీ నుంచి దాదాపు 15 నోటిఫికేషన్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. వాటిలో మేజర్ గా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4(Group 4) ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటు.. అదనంగా స్పెషల్ అర్హతతో కూడి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అయితే గురుకులకు(Gurukul) సంబంధించి 9వేలకు పైగా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. వీటి భర్తీకి అధికారులు అంతా ఏర్పాటు పూర్తి చేశారు. ఇప్పటికే పోస్టుల భర్తీకి సంబంధించి గురుకుల విద్యాసంస్థల నుంచి నియామకాల బోర్డుకు ఇండెంట్లు(ప్రతిపాదనలు) పంపించాయి. ఈ ప్రతిపాదనల మేరకు పోస్టుల వారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలు పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది.
మొత్తం నాలుగు గురుకుల సొసైటీల పరిధిలోని 9,096 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది. వారం రోజుల్లోకి ఈ బోర్డు ప్రతిపాదనలు పరిశీలించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , సాధారణ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు అదనంగా మరో 3వేల పోస్టులు రానున్నాయి.
2022-23కి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాల్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోస్టుల మంజూరుకు ఆ ఫైల్ పై సీఎం సంతకం చేసి.. బీసీ సంక్షేమ శాఖకు పంపించారు. ప్రస్తుత నియామకాల్లో భాగంగా.. వీటిని కూడా కలిపి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దాదాపు 12 వేలకుపైగా పోస్టులకు వారం లేదా పది రోజుల్లో ఒక్కొక్కటిగా ప్రకటనలు జారీ చేసేందుకు గురుకుల నియామక బోర్డు సన్నాహాలు చేస్తోంది.
మొత్తం అనుమతించిన పోస్టుల వివరాలిలా..
1. బీసీ గురుకులాల్లో - 3870
వీటిలోనే అదనంగా మరో 3వేల పోస్టులు కలవనున్నాయి.
2. ఎస్సీ గురుకులాల్లో ఖాళీలు.. 2267
3. ఎస్టీ గురుకులాల్లో ఖాళీలు.. 1514
4. మైనార్టీ గురుకులాల్లో ఖాళీలు.. 1445
పైన చెప్పిన గురుకుల సొసైటీల్లో ఎలాంటి బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా భర్తీ చేయనున్నారు. రాష్ట్ర పతి ఉత్తర్వుల మేరకు బోధన, బోధనేతర సిబ్బంది సర్దుబాటు పూర్తి కావడంతో.. జోన్లు, మల్లీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలా మొత్తం 12 వేలకు పైగా ఉన్న గురుకు పోస్టులకు డిసెంబర్ లో నోటిఫికేషన్ వెలువడనుంది. వారం రోజుల్లోగా ప్రతిపాదనలు పూర్తయిన అనంతరం ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రాధాన్యత క్రమంలో పై నుంచి కింది స్థాయి వరకు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gurukula colleges, JOBS, Ts gurukula