Politechnic students: పాలిటెక్నిక్ చదవాలనుకునే మహిళా విద్యార్థినులకు గుడ్ న్యూస్.. కొత్త కోర్సు ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ..  తెలంగాణలో మొత్తం..

పాలిటెక్నిక్ కళాశాల

Politechnic students: పాలిటెక్నిక్ లోనే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి శుభవార్త. పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లోమా ఇన్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు (డీసీఎంఈ)ను ప్రవేశపెడతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో మొత్తం రెండు మహిళా కళాశాలలో మాత్రమే ఈ అవకాశం ఉంది. 

  • Share this:
    సిద్దిపేట పట్టణ శివారులోని పెద్దకోడూరు పాలిటెక్నిక్‌ మహిళా కాలేజీలో కొత్త కోర్సు మంజూరు చేస్తూ  సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎలక్ట్రికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ఉండగా.. తాజాగా డిప్లోమా ఇన్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు (డీసీఎంఈ) మంజూరైంది. 60 మంది విద్యార్థినులకు సీట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్‌ కోర్సు మొదటగా సికింద్రాబాద్‌ మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉండగా.. రెండోది పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ కావడం సిద్దిపేట ప్రాంత విశిష్టతను పెంచినట్లయ్యింది. ఈ ఏడాది నుంచే ఈ కొత్త కోర్సు ప్రారంభమవుతుంది. పాలీసెట్‌ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన అమ్మాయిలకు ఇక్కడ ఉచిత కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ విద్య అందుతుంది. మూడేళ్ల పరిమితి కలిగిన ఈ కోర్సు పూర్తయ్యాక ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పెద్ద కోడూరు మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ కోర్సులో 180 మంది, సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో 180 మంది అమ్మాయిలు చదువుతున్నారు. కొత్తగా కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో మొదటి ఏడాది 60 మంది చేరతారు.

    పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో వ్యవహరించారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖతో ఎప్పటికప్పుడు ఈ కోర్సు గురించి ఆమోదం కోసం ప్రయత్నించారు. త్వరలోనే పాలీసెట్‌  పరీక్ష జరగనున్న క్రమంలో గట్టిగా ప్రయత్నించి సఫలమయ్యారు. ఈ ఏడాది నుంచే కోర్సులో చేరే అవకాశాలు ఉంటాయని , అతి తక్కువ రోజుల్లో ఓ కాలేజీకి కొత్త కోర్సు రావడం ఇదే  ప్రథమమని కాలేజీ ప్రిన్సిపాల్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

    సిద్దిపేట ప్రాంతం ఒక విద్యాక్షేత్రంగా విలసిల్లడం గర్వంగా ఉందని.. ఇప్పటికే సిద్దిపేట పట్టణ చుట్టూరా 4 పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ, పీజీ కాలేజీ, అటానమస్‌ డిగ్రీ కళాశాలతోపాటు మహిళా డిగ్రీ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే సిద్దిపేట ప్రాంతంలో ఐటీ టవర్‌ కు భూమిపూజ జరిగింది. త్వరలోనే సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలోనే పెద్దకోడూరు పాలిటెక్నిక్‌ కళాశాలలో కొత్తగా కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు మంజూరు కావడం హర్షించదగిన విషయం. కొత్త కోర్సు నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలు, సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు.
    Published by:Veera Babu
    First published: