(K.Lenin,News18,Adilabad)
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు, గురుకుల పాఠశాల విద్యార్ధులు సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా ఆదివాసుల ఖిల్లాగా పిలవబడే కొమురంభీమ్ ఆసిఫాబాద్(komarambheem Asifabad) జిల్లాలో విద్యార్ధులు ఇంటర్మీడియట్ (Intermediate) మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో మెరుగైన స్థానాన్ని దక్కించుకొని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. ఇంటర్ సెకండ్ ఈయర్‌లో 77 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచారు విద్యార్ధులు. ఫస్ట్ ఈయర్‌లో 72 శాతం ఫలితాలతో మూడవ స్థానంలో నిలిచింది ఆసిఫాబాద్ జిల్లా.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్(Kagaznagar)పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College)కు చెందిన ఎంపిసి(MPC) విద్యార్థి జెల్లా అమన్(Jella Aman)వెయ్యికి 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్ గా నిలిచాడు.
ఆదివాసి జిల్లాలో సరస్వతి బిడ్డలు..
ఆదిలాబాద్ జిల్లా సెకండ్ ఇంటర్ ఫలితాల్లో కేవలం 8 శాతం ఉత్తీర్ణతో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 64 శాతం ఫలితాలతో 9వ స్థానంలో నిలిచింది. అటు నిర్మల్ జిల్లా ద్వితీయ సంవత్సరంలో 67 శాతం ఫలితాలతో 15వ స్థానంలో, మొదటి సంవత్సరంలో 51 శాతం ఫలితాలతో 14వ స్థానాన్ని ఆక్రమించగా, మంచిర్యాల జిల్లా ద్వితీయ సంవత్సరంలో 64 శాతం ఫలితాలతో 24వ స్థానంలో, ప్రథమ సంవత్సరంలో 53 శాతం ఫలితాలతో 30వ స్థానానికి పరిమితమైంది. మొత్తంమీద ఈ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించడం విశేషం.
ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా..
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులే మెరుగైన ఫలితాలు సాధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంటర్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ సహా పలువురు అభినందించారు. 990 మార్కులతో రాష్ట్ర టాపర్ గా నిలిచిన జెల్లా అమన్ తోపాటు 1000కి 987 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండవ స్థానంలో నిలిచిన ఎం.పి.సి విద్యార్థిని భావన, 976 మార్కలతో తృతీయ స్థానంలో నిలిచిన ఆసిఫాబాద్ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థి సాయి శ్రీతేజ ను కలెక్టర్ సత్కరించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ర్యాంకర్లకు సత్కారం ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంటర్ విద్యార్థులు ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలల విద్యార్థులకు ధీటుగా ప్రతిభను కనబరిచి మెరుగైన ఫలితాలు సాధించారు. అయితే గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడంతో వంద శాతం ఫలితాలు సాధించగా, రెండేళ్ళ తర్వాత నిర్వహించిన పరీక్షలో సాధించిన ఫలితాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు పర్వాలేదనిపించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, TS Inter Results 2022