Google Search: డిజిటల్ యుగంలో దాదాపు అందరి చేతుల్లో ఫోన్ ఉంది. ఇంటర్నెట్ డేటా ధరలు కూడా అందుబాటులో ఉండటంతో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఏదైనా సమాచారం అవసరమైతే వెంటనే గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తున్నారు. అయితే ఏటా గూగుల్‌లో యూజర్లు ఎక్కువగా సెర్చ్ (Google search)చేసిన విషయాలను సెర్చ్ ఇంజన్ వెల్లడిస్తుంటుంది. 2022 సంవత్సరంలో ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేశారనే వివరాలను తాజాగా వెల్లడించింది. ‘వాట్ ఈజ్’ కేటగిరీ కింద అగ్నిపథ్ పథకం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు పేర్కొంది. సాయుధ బలగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేపట్టడానికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. 2022 గూగుల్ సెర్చ్‌లో ఈ స్కీమ్ టాప్‌లో నిలిచింది.
యువతను ప్రోత్సహించేందుకు అగ్నిపథ్
సాయుధ దళాల్లో చేరేలా యువతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని 2022 జూన్ 14న ప్రారంభించింది. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత ఈ పథకం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ , ఇండియన్ నేవీ నిర్వహించే రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులను అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరు నాలుగేళ్ల పాటు స్వరీస్లో ఉంటారు.
మొదట ట్రైనింగ్, ఆపై సర్వీస్
ఈ నాలుగేళ్ల కాలంలో అగ్నివీర్స్ మొదట ట్రైనింగ్ పొందుతారు. ఆ తరువాత సంబంధిత దళం సర్వీస్‌లో చేరతారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్వీస్‌కు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది.
Farming Idea : ఔషధ మొక్క.. ఈ సాగుతో రూ.4 లక్షల ఆదాయం
సర్వీస్ కాలంలో చదువుకునే అవకాశం
అగ్నిపథ్ పథకం కింద ఎంపిక అగ్నివీర్స్ తమ సర్వీస్ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయవచ్చు. ఈ కోర్సును ఇగ్నో యూనివర్సిటీ సహకారంతో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 10, 12వ తరగతుల విద్యార్థులు సాయుధ దళాల్లో చేరితే, వారి పాఠశాల విద్యను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్సులను రూపొందించడానికి కూడా కృషి చేస్తోంది.
25 శాతం మందికే పర్మనెంట్ జాబ్
బ్యాచ్ మొత్తంలో 25శాతం మంది అగ్నివీర్స్ పర్మనెంట్ కేడర్‌కు ఎంపిక కానున్నారు. మిగతావారు నాలుగేళ్ల సర్వీస్ తరువాత పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్ తరువాత అగ్నివీర్లకు ఎలాంటి పెన్షన్ సదుపాయం ఉండదు. అయితే సర్వీస్ కాలం ముగిసే సమయానికి దాదాపు ₹11.71 లక్షల మొత్తాన్ని అగ్నివీర్స్ పొందనున్నారు.
పెద్దఎత్తున ఆందోళనలు
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. పలు చోట్ల తీవ్ర హింస చోటుచేసుకుంది. రక్షణ దళాల్లో చేరాలనుకుంటున్న అశావహులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కాగా త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే 2022 బ్యాచ్ అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ పూర్తిచేశాయి. తాజాగా 2023 బ్యాచ్ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google