ప్రపంచ దేశాలు లింగ వివక్షను రూపుమాపడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. గత కొన్ని దశాబ్దాలుగా చాలా దేశాల్లో ఉద్యోగాల్లో మహిళల శాతం పెరిగింది. కానీ భారత్‌లో నేటికీ ఉద్యోగాలు, ప్రమోషన్లలో ఆడవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని లింక్డ్ ఇన్ జాబ్ పోర్టల్ చేసిన తాజా అధ్యయనం తెలిపింది. లింగ వివక్ష కారణంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సగటున 60 శాతం మంది మహిళలు, భారత్‌లో 85 శాతం మంది మహిళలు ప్రమోషన్ లేదా వర్క్ ఆఫర్‌కు దూరమవుతున్నారని లింక్డ్ ఇన్ ఆపర్చునిటీ ఇండెక్స్- 2021 సర్వే చెప్పింది. ఈ వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మన దేశంలో 85 శాతం మంది మహిళలు జెండర్ కారణంగా కెరీర్ గ్రోత్, ప్రమోషన్, వర్క్ ఆఫర్‌ను మిస్ అవుతున్నారని తేల్చింది.
ఈ ఏడాది జనవరి 26 నుంచి జనవరి 31 మధ్య లింక్డ్ ఇన్ ఈ ఆన్ లైన్ సర్వే చేసింది. ఇందుకు ఇండిపెండెంట్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జీఎఫ్కే సాయం తీసుకుంది. ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ దేశాల ఉద్యోగులపై సర్వే జరిగింది. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న 10 వేల మందిని కెరీర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. భారతదేశంలో 2,285 మంది (1,223 మంది మగవాళ్లు, 1,053 మంది మహిళలు) సర్వేలో పాల్గొన్నారు.
కెరీర్‌పై కుటుంబ బాధ్యతల ప్రభావం: ఉద్యోగ అవకాశాల సమయంలో ఉద్యోగ భద్రత, తాము ప్రేమించే ఉద్యోగం, మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వంటివి చూస్తామని చాలామంది చెప్పారు. భారత్‌లో యజమాని, పనికి పొందే గుర్తింపు, ఉద్యోగ నైపుణ్యాల ఆధారంగానే ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. అయినా కుటుంబ బాధ్యతల కారణంగా ఆఫీసులో వివక్షను ఎదుర్కొంటున్నామని 63 శాతం మంది వర్కింగ్ ఉమెన్, 69 శాతం మంది వర్కింగ్ మదర్స్ చెప్పారు. ఇంతకు ముందు జనరేషన్‌తో పోలిస్తే లింగ సమానత్వం పెరిగిందని 66 శాతం మంది ఉద్యోగులు చెప్పడం విశేషం. కెరీర్ డెవలప్మెంట్ సమయంలోనే కుటుంబ బాధ్యతలు ఎదురవుతున్నాయని ప్రతి 10 మంది మహిళల్లో ఏడుగురు చెప్పారు. ఇవన్నీ వారి ఎదుగుదలను వెనక్కు లాగుతున్నాయని సర్వే తెలిపింది.
పక్షపాత ధోరణి: కెరీర్ గ్రోత్ విషయంలో మహిళల అసంతృప్తికి కారణాలను లింక్డ్ ఇన్ అన్వేషించింది. భారత్‌లో పని విషయంలో కంపెనీలు మగవాళ్లకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని 22 శాతం మంది మహిళలు చెప్పారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ సగటు 16 శాతంగా ఉంది. మన దేశంలో పనిచేస్తున్న మహిళల్లో 37 శాతం మంది మహిళలు... తమకు మగవాళ్ల కంటే తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ 25 శాతం మంది మగవాళ్లు మాత్రమే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. తమకు పురుషుల కంటే తక్కువ జీతాలు ఇస్తున్నారని 37 శాతం మంది మహిళలు చెప్పారు. కానీ 21 శాతం మంది మగవాళ్లు మాత్రమే దీన్ని అవునని ఒప్పుకున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి జెండర్‌కు మధ్య సంబంధం ఉందని 63 శాతం మంది మహిళలు చెప్పారు. కానీ వారి కంటే తక్కువగా 54 శాతం మంది మగవాళ్లు ఈ అభిప్రాయం నిజమే అన్నారు.
ఇది కూడా చదవండి: Lizards and destiny: భవిష్యత్తును చెప్పే బల్లి... నేలపై నడిస్తే ఏమవుతుందో తెలుసా?
ప్రతికూల ప్రభావం చూపిన కరోనా: కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని 86 శాతం మంది భారతీయులు చెప్పారు. ఉద్యోగ విరమణ, జీతాల్లో కోతలు, పనిగంటలు తగ్గించడం వంటివి ఎదురయ్యాయని ప్రతి 10లో 9మంది చెప్పారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సర్వే సూచించింది. ఈ అంశంపై కంపెనీలు దృష్టి పెట్టాలని లింక్డ్ ఇన్ ఇండియా టాలెంట్ అండె లెర్నింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ రుచీ ఆనంద్ చెప్పారు.