ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ చేయాలంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) రాయాలి. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ బెంగళూరు, ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా BARC, ISRO, DRDO, CSIR మొదలైన ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రభుత్వ రంగ కంపెనీలలో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. అత్యంత కఠిన పరీక్షల్లో GATE కూడా ఒకటి. ఇందులో అత్యధిక స్కోర్ సాధించేందుకు అభ్యర్థులకు T.I.M.E ఇన్‌స్టిట్యూట్‌లో అకడమిక్స్(గేట్) హెడ్ మురళీ కార్తికేయన్ కొన్ని టిప్స్ అందజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
* ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి
ప్రీవియస్ పేపర్స్‌ను అభ్యర్థులు కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. దీంతో ఎగ్జామ్‌లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే అంశంపై స్పష్టత వస్తుంది. అభ్యర్థులు తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వెనకబడిన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా మంచి స్కోర్‌ను సాధించవచ్చు.
* సిలబస్‌పై పూర్తి అవగాహన
సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌పై పూర్తి అవగాహన అవసరం. ప్రతి సబ్జెక్టు వెయిటేజీని తెలుసుకొని, దాని ప్రకారం ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్క పేపర్‌లో సబ్జెక్ట్‌లు, టాపిక్‌లు ఉంటాయి. వీటికి ఇతర పేపర్‌లతో పోల్చినప్పుడు వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్టులపై అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల అత్యధిక స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.
* బలహీనమైన సబ్జెక్టులపై దృష్టి
అభ్యర్థులు ముందుగా బలహీనంగా ఉన్న సబ్జెక్ట్‌లు లేదా టాపిక్‌లను గుర్తించాలి. ఆ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. అన్ని అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫార్ములాల షీట్, రిఫరెన్స్ టేబుల్ షీట్ వంటివి తయారు చేసుకోవాలి.
* న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్
గేట్ ఎగ్జామ్‌లో ఎక్కువగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు వేగం, కచ్చితత్వం అవసరం. ఎక్కువ సంఖ్యలో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ విభాగంలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రకమైన ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
* స్టడీ మెటీరియల్ ఎంపిక
స్టడీ మెటీరియల్‌ని తెలివిగా ఉపయోగించుకోవాలి. సెమిస్టర్ ఎగ్జామ్స్ పుస్తకాలు కాకుండా GATE కోసం రూపొందించిన స్టడీ మెటీరియల్‌లను ఎంచుకోవాలి. డిస్క్రిప్టివ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ గేట్ ఎగ్జామ్ మెటీరియల్ భిన్నంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : యూపీఎస్సీ నుంచి భారీగా నోటిఫికేషన్.. 1105 పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలివే..!
* టైమ్ మేనేజ్‌మెంట్
ఏ ఎగ్జామ్‌లో అయినా మంచి స్కోర్ సాధించాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం. ప్రశ్నకు సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటే.. మిగతా ప్రశ్నలను చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అన్ని ప్రశ్నలకు వీలైనంత తక్కువ సమయం కేటాయించేలా చూసుకోవాలి. మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన వస్తుంది.
* ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం
గేట్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు ఏకాగ్రతతో ఉండాలి. చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. సోషల్ మీడియా, టీవీ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వ్యాయామం, పోషకాహారం, సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించడం చాలా ముఖ్యమని గుర్తించాలి. పాజిటివ్‌గా ఉండాలి, తమ సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలి. చిన్న చిన్న ఇబ్బందులకు నిరుత్సాహ పడకుంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ సూచనలు పాటిస్తే గేట్‌లో మంచి స్కోర్ సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Gate 2023, IIT, JOBS