ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంటెక్ ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)–2022 పరీక్ష ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు జరగనుంది. ఈ ఏడాది గేట్ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించనుంది. దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. అయినప్పటికీ, పరీక్షను వాయిదా వేయడం లేదని, షెడ్యూల్ ప్రకారమే పరీక్షను నిర్వహిస్తామని ఐఐటీ ఖరగ్‌పూర్ స్పష్టం చేసింది. దీంతో పరీక్షకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో ఎలా ప్రిపేరవ్వాలి? ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాలి? ఎక్కువ స్కోర్ ఎలా సాధించాలి? అనే విషయాలపై గత టాపర్లు చెబుతున్న చిట్కాలను పరిశీలిద్దాం.
సిలబస్‌పై అవగాహన పెంచుకోండి
గేట్–2021లో విజయం సాధించిన 52 ఏళ్ల వర్షా మిశ్రా వర్మ తన సక్సెస్ ఫార్మూలాను వివరించారు. తాను కేవలం నెలన్నర పాటు ప్రణాళికాబద్దంగా చదివి గేట్లోఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఎటువంటి కోచింగ్ లేకుండానే ప్రిపేరషన్ కొనసాగించినట్లు చెప్పారు. ప్రీవియస్ పేపర్లను సాధన చేయడంతో సహా యూట్యూబ్ ఛానెళ్లలో ఆన్లైన్ క్లాసులను ఫాలో అయ్యానని పేర్కొన్నారు. గేట్ పరీక్షకు సన్నద్దమయ్యే వారు ముందుగా సిలబస్‌పై పట్టు సాధించాలని, ప్రణాళికబద్దంగా సమయాన్ని కేటాయించుకొని ప్రిపేరవ్వాలని తెలిపారు.
కాన్సెప్టులపై పట్టు సాధించాలి
గేట్ 2021 టాపర్, సిద్ధార్థ్ సబర్వాల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పేపర్‌లో గతేడాది 100కి 82 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. గేట్ 2021 పరీక్ష కోసం, సబర్వాల్ మాక్ ఎగ్జామ్‌లకు అటెండ్ అయ్యానని చెప్పారు. వీటితో పాటు ప్రీవియస్ పేపర్లను బాగా ప్రాక్టీస్ చేశారని పేర్కొన్నాడు. రిఫరెన్స్ పుస్తకాలు అకడమిక్లోనే పనికొస్తాయని, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో నెగ్గాలంటే కాన్సెప్టులపై పట్టుసాధించాలని సిద్దార్థ్ సబర్వాల్ వివరించాడు.
అన్ని సబ్జెక్టులపై దృష్టి పెట్టాలి
తమిళనాడు హిందూ కళాశాలలో గణితశాస్త్రం బోధించి రిటైరైన విశ్రాంత ఉపాధ్యాయుడు, 67 ఏళ్ల శంకరనారాయణన్ శంకరపాండియన్ గేట్ 2021లో ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో విజయం సాధించడానికి 30 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టలేదని శంకరపాండియన్ చెప్పారు. వెనుకబడి ఉన్న టాపిక్స్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పారు. గేట్‌లో నెగెటివ్ మార్కింగ్, కటాఫ్ మార్కులు ఉన్నందున ప్రతి సబ్జెక్టుకు తగిన సమయం కేటాయించాలని కోరారు.
గేట్–2022లో కీలక మార్పులు
గేట్–2022లో రెండు కొత్త విభాగాలను జోడించారు.- ఈసారి జియోమాటిక్స్ ఇంజనీరింగ్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్ విభాగాల్లో సైతం గేట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. దీంతో మొత్తం 29 విభాగాలపై పరీక్ష జరగనుంది. ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు పేపర్లకు హాజరుకావచ్చు. గేట్–2022 పరీక్ష మొత్తం రెండు స్లాట్‌లలో జరగనుంది.- మొదటిది ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండోది మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తారు. గేట్ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు ఐఐటీ, ఐఐఎస్సీఆర్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్ కోర్సులో చేరేందుకు అర్హులు. గేట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పీఎస్‌యూల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గేట్ స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exam Tips