నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సంక్షిప్తంగా నీట్. జాతీయ స్థాయిలో సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్లలో ఎంబీబీఎస్, బీడీఎస్‌లతో పాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్ ఎంట్రన్స్ స్కోరే ప్రధానం. నీట్ స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే, ఇంటర్మీడియట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు ఏటా పోటీ పెరుగుతోంది. అందుకే దీన్ని భారత్‌లోని అన్ని పోటీ పరీక్షల్లో కెళ్లా అత్యధిక పోటీ గల పరీక్షగా పేర్కొంటారు. విద్యార్థులు ఈ పరీక్షలో విజయం సాధించేందుకు సంవత్సరం ముందు నుంచే సరైన ప్రణాళిక రూపొందించుకొని, పట్టుదలతో ప్రిపరేషన్ కొనసాగించాలి. అయితే, ఈ పరీక్షకు కేవలం 2 నెలల సమయం ఉన్నందున.. ఈ సమయంలో ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి? విజయం ఎలా సాధించాలి? అనే విషయాలపై ఓలుక్కేద్దాం.
కష్టమైన కాన్సెప్ట్లపై ఎక్కువ దృష్టి పెట్టండి
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు, ముందుగా ప్రతి సబ్జెక్టులోని ప్రతి అధ్యాయంలో మీరు కష్టంగా భావించే అంశాలను గుర్తించండి. ఈ అధ్యాయాలను సవరించడానికి, పరిష్కరించడానికి ఎక్కువ సమయం కేటాయించండి. కఠినమైన సూత్రాలను నోట్ చేసుకొని వాటిని పదే పదే చదువుతూ ఉండండి.
ప్రణాళిక ప్రకారం చదవండి
ఒక్కొక్కరు ఒక్కో విధంగా చదువుతారు. ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే రకమైన విధాన్నాన్ని అనుసరించరు. ఎవరి సొంత ఆలోచనలు, ప్రణాళిక ప్రకారం వారు ప్రిపరేషన్ కొనసాగిస్తారు. కొందరు గ్రాఫిక్స్ తో అధ్యయనం చేస్తే, మరికొందరు, ఆయా అధ్యాయాలను నిజ జీవిత పరిస్థితులతో అనుసంధానం చేసుకుంటూ చదువుతుంటారు. అయితే, మీ పరీక్ష విజయానికి ఏ మార్గం ఉత్తమంగా పనిచేస్తుందో అంచనా వేసుకోవాలి. అదే మార్గాన్ని ఫాలో అవ్వాలి.
ఎన్సిఈఆర్టి సిలబస్‌పై దృష్టి పెట్టండి
నీట్ పరీక్ష ఎన్సీఈఆర్టీ సిలబస్‌పై ఆధారపడి ఉంటుంది. ఎన్సీఈఆర్టీ సిలబస్ బాగా లోతైన అధ్యయనంతో కూడిన కంటెంట్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల, నీట్ ఎగ్జామ్‌లో పెద్ద సంఖ్యలో ప్రశ్నలు ఈ పుస్తకాల నుంచే వస్తాయి. ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ఒక ప్రణాళిక ఏర్పర్చుకోండి. మీ పాఠ్యపుస్తకంలోని ఏ అధ్యాయం నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఎన్ని మార్కుల వెయిటేజీ ఉంటుంది? అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేశామా? లేదా? అనే అంశాలపై అవగాహన పెంచుకోని ప్రిపరేషన్ ప్రారంభించండి.
మాక్ టెస్ట్‌లు, ప్రీవియస్ పేపర్లను సాధన చేయండి
NEET పరీక్ష కాస్త కఠినంగానే ఉంటుంది. అందువల్ల, క్రిందటి సంవత్సరంలో వచ్చిన ప్రశ్నలను సాధన చేయడం మీ ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతుంది. దీని ద్వారా పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. అందువల్ల, వీలైనన్ని ఎక్కువ మాక్ పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. ఇది పరీక్ష సమయంలోనూ టైం మేనేజ్మెంట్కు ఉపయోగపడుతుంది.
ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించండి
మాక్ పరీక్షలను సాధన చేస్తే సరిపోదు.. ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించి, వాటిని రిఫరెన్స్ బుక్స్ లేదా ప్రొఫెసర్ల ద్వారా నివృత్తి చేసుకోవాలి. తద్వారా మళ్లీ అవే తప్పులు జరగకుండా ఉండేందుకు మీకు ఉపయోగపడుతుంది.
చిట్‌చాట్, ఎంటర్టైన్మెంట్ మానేయండి
పరీక్షకు కొద్ది రోజుల ముందు టైం టేబుల్ ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన సమయమని భావించండి. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. స్నేహితులతో. బంధువులతో కాలక్షేపం చేయడం, సినిమాలు, సోషల్ మీడియా, టీవీ షోలు చూడడాన్ని కొద్ది కాలం పాటు మానేయండి.
ఆహారం, నిద్ర
పరీక్ష రోజుల్లో మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. ఎందుకంటే, పరీక్ష రోజున మీరు అనారోగ్యానికి గురైతే సంవత్సరం నుంచి చేస్తున్న కృషి వృథా అవుతుంది. అందువల్ల, బయట జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనివ్వండి. అంతేకాక, మీరు చదివింది గుర్తుండాలంటే సరైన నిద్ర చాలా అవసరం. నిద్ర తర్వాత, మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. అప్పుడు మీ మెదడు వేగంగా పనిచేస్తుంది.
పరీక్ష సమయంలో ఇలా చేయండి
పరీక్ష సమయంలో మీపై మీరు విశ్వాసంతో ఉండండి. పరీక్షా కేంద్రం వద్ద ఇతరులను చూసి ఆందోళన పడకండి. ముందుగా సులువైన ప్రశ్నలకు సమాధానం గుర్తించండి, ఆ తర్వాత కఠినమైన ప్రశ్నలకు వెళ్లండి. ఇలా ఒక స్ట్రాటజీ ప్రకారం పరీక్షను పూర్తిచేయండి.
సమాధానం తెలియకపోతే వదిలేయండి
నీట్లో నెగెటివ్ మార్కులు ఉంటాయి. కాబట్టి, తెలియని సమాధానాలను వదిలేయడమే మంచింది. ఊహించి సమాధానం గుర్తించడం వల్ల మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, సమాధానం తెలిస్తేనే గుర్తించండి.
ప్రశాంతంగా ఆలోచించండి
మీకు తెలియని ప్రశ్నలు వస్తే ఆందోళన చెందకండి. ఎందుకంటే దీని ప్రభావం ఇతర ప్రశ్నలపై పడుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా లోతైన శ్వాస తీసుకొని మళ్లీ పరీక్ష ప్రారంభించండి. పరీక్షలో విజయం సాధించాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది మీపై మీకు నమ్మకం ఉండటం. దీన్ని కోల్పోకుండా పరీక్షను విజయవంతంగా ఎదుర్కోండి.. నీట్ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.