FARMERS SON FROM MAHARASHTRAS BULDHANA DISTRICT WINS CHEVENING SCHOLARSHIP HERE DETAILS NS GH
Chevening Scholarship: యూకేలోని చెవెనింగ్ స్కాలర్షిప్కు ఎంపికైన మహారాష్ట్ర యువకుడు.. అతని సక్సెస్ స్టోరీ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని లోనార్కు చెందిన 27 ఏళ్ల రాజు కేంద్రే అనే యువకుడు యూకేలోని ప్రతిష్టాత్మక చెవెనింగ్ స్కాలర్షిప్కు ఎంపికై సత్తా చాటాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ విద్యార్థులు ఖండాంతరాలు దాటి తమ ప్రతిభ చాటుకుంటున్నారు. విదేశాల్లోని ప్రతిష్టాత్మక వర్సిటీల్లో స్కాలర్షిప్ దక్కించుకొని సత్తా చాటుతున్నారు. తాజాగా, మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని లోనార్కు చెందిన 27 ఏళ్ల రాజు కేంద్రే అనే యువకుడు యూకేలోని ప్రతిష్టాత్మక చెవెనింగ్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. యూకేలోని ప్రతిష్టాత్మక వర్సిటీల్లో పీజీ అడ్మిషన్ పొందిన విద్యార్థుల నుంచి అత్యంత ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. ఈ స్కాలర్షిప్ను యూకే ప్రభుత్వం ఇంటర్నేషనల్ అవార్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అందజేస్తుంది. అయితే, భారత్‌తో సహా 160కి పైగా దేశాలకు చెందిన వారినే దీనికి ఎంపిక చేస్తారు. ఇక, స్కాలర్షిప్ గెలుచుకున్న రాజు కేంద్రే సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడు లోనార్ గ్రామం నుంచి యూకే అంతర్జాతీయ స్కాలర్షిప్ చేరుకునే వరకు అతను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా 2011లో పూణే విశ్వవిద్యాలయంలో తన ప్రవేశాన్ని కోల్పోయాడు. Sonu Sood : సోనూ సూద్ మరో సంచలన నిర్ణయం.. ఆ కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు ఉచిత సాయం
ఈ ఘనతపై రాజు మాట్లాడుతూ.. “నేను విదర్భ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలోని సంచార తెగకు చెందిన వ్యక్తిని. నా తండ్రి ఒక సాధారణ రైతు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా సరే నా కల నెరవేర్చుకోవడానికి అహర్నిశలు శ్రమించాను. ఎట్టకేలకు చెవెనింగ్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాను. నేను సాధించిన విజయంతో స్పూర్తి పొంది మా సంచార తెగకు చెందిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ వర్సిటీల్లో సీట్లు దక్కించుకోవాలని ఆశిస్తున్నాను. ఇది వారికి ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నాను.” అని అన్నారు.
తొమ్మిదేళ్లుగా సోషల్ వర్క్..
"నా తల్లిదండ్రులు ప్రాథమిక స్థాయి వరకు మాత్రమే విద్యను పూర్తి చేశారు. ఈ చెవెనింగ్ స్కాలర్షిప్ అంటే ఏమిటో కూడా వారికి అవగాహన లేదు. వారు ఈ పేరును కూడా సరిగ్గా ఉచ్చరించలేరు. కాని నా చదువు కోసం వారు పడ్డ శ్రమ, తపన వల్లే ఈ ఘనత సాధించగలిగాను. నాలాగే ఎంతో మంది యువకులకు విదేశీ విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనుకునే ఆసక్తి ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా వెనకడుగు వేస్తుంటారు. నా ప్రయాణం వారందరికీ స్పూర్తిదాయంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.’’ అని తెలిపారు.
రాజు తుల్జాపూర్ క్యాంపస్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఎంఏ పూర్తి చేశాడు. గ్రామీణాభివృద్ధిలో సోషల్ వర్క్‌పై అధ్యయనం చేశాడు. ఏకలవ్య అనే ఎన్జీఓ ఏర్పాటు చేసి విదర్భలోని గిరిజన ప్రాంతాలలో గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. చెవెనింగ్ స్కాలర్షిప్ను దక్కించుకున్న రాజును ధనంజయ్ ముండే, జయంత్ పాటిల్ వంటి మంత్రులతో సహా సోషల్ మీడియాలో చాలా మంది అభినందించారు.
చెవెనింగ్ స్కాలర్షిప్ అంటే ఏమిటి?
చెవెనింగ్ స్కాలర్షిప్ను యూకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్లోబల్ లీడర్స్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని రూపొందించింది. ఫారన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్(ఎఫ్సిడిఓ) భాగస్వామ్య సంస్థల నిధులతో దీన్ని నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటిష్ రాయబార కార్యాలయాల్లోని హై కమీషన్ అధికారులు- ఈ చెవెనింగ్ స్కాలర్షిప్, చెవెనింగ్ ఫెలోషిప్‌లకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.