Telangana Schools Reopening: విద్యార్థులకు అలర్ట్.. ఆ తేదీన విద్యాసంస్థలు ప్రారంభం.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana Schools Reopening: విద్యాసంస్థల ప్రారంభం సెప్టెంబర్ 1 నుంచి మొదలు కానున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీటిని విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇవే..

  • Share this:
    ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ స్పీడందుకుంది. కరోనా వ్యాప్తి కూడా తగ్గుముఖం పట్టింది. దాంతో బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ ట్రెండ్‌ అన్ని దేశాలలో కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగునంగా 50 కి పైగా దేశాలలో ఇప్పటికే స్కూళ్లు రీ ఓపెన్‌ అయ్యాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. కరోనా దెబ్బకు కుదేలైన వాటిలో విద్యా రంగం ఒకటి. పిల్లలు చదువును కోల్పోగా.. ఆ రంగంపై జీవించే ఎంతో మంది ఉపాధ్యాయుల జీవనం ఆగమ్యగోచరంగా తయారైంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో పని చేసే వేలాది మంది ఉపాధ్యాయులు వీధిన పడ్డారు. అలాగే చిన్న మధ్య తరగతి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలావరకు ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. కరోనా కారణంగా 15 నెలల నుంచి బడులు బంద్ అయ్యాయి. ఆన్‌లైన్ తరగతులున్నా అందరికీ అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారు.

    స్కూల్‌ వాతావరణం పిల్లలకు చదువుతో పాటు మానసిక వికాసాన్ని అందిస్తుంది. ఐక్యరాజ్యసమితి రిపోర్టు ప్రకారం పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదహారు కోట్ల మంది పిల్లల విద్య ప్రభావితమైందని తెలిపింది. అంతే కాదు భవిష్యత్తులో పిల్లల పోషకాహారం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులపై కూడా కరోనా ప్రతికూల ప్రభావం కనిపించనుంది. చాలా దేశాలలో గత నెలలోనే పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. రెండు నుంచి పదకొండేళ్ల మధ్య వయస్సు పిల్లలకు కరోనా వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అందుకే వారిని బడికి పంపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా పాఠశాలలు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలలో స్కూళ్లు మొదలయ్యాయి కూడా. మరి కొన్ని రాష్ట్రాలలో కూడా బడులు తెరిచేందుకు కసరత్తు మొదలు పెట్టారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలతో పాఠశాలలు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పాఠశాలలు విధిగా కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను పాటించాలి. ప్రతి స్కూల్‌లో కనీసం రెండు ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

    అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రాథమిక వైద్యాన్ని అందించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు శానిటైజర్‌, ఫేస్‌మాస్కులు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఎనిమిది రాష్ట్రాలలో ఆగస్టులో పాఠశాలలు తెరుచుకున్నాయి. దేశంలో మొట్టమొదటగా హర్యానాలో 9 నుండి 12 వ తరగతి వరకు తొలి ఫేస్ టూ ఫేస్ క్లాసులు ప్రారంభమయ్యాయి. జూలై 16 నుంచి వీటిని ప్రారంభించారు. తరువాత నాగాలాండ్ 11, 12 తరగతులకు జూలై 26 నుంచి అనుమతించింది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలని ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది. అందుకు కావాల్సిన కోవిడ్‌ ప్రోటోకాల్‌ కు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 23 నుంచి కర్టాటకలో బడులు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీటిని విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది.
    Published by:Veera Babu
    First published: