EDUCATION LOAN BANKS LAG BEHIND IN EDUCATION LOANS WHAT IS THE REASON FOR BANKS FEAR GH VB
Education Loan: ఎడ్యుకేషన్ లోన్స్ విషయంలో బ్యాంకుల వెనకడుగు.. బ్యాంకుల భయానికి కారణాలేంటి..?
ప్రతీకాత్మక చిత్రం
బ్యాంకులు (Banks) జారీ చేస్తున్న విద్యారుణాల(Education Loan) శాతం తగ్గిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం కంటే 2022వ సంవత్సరం జనవరిలో విద్యార్థులకు బ్యాంకు రుణాలు దాదాపు 6 శాతం తగ్గి రూ.63,000 కోట్లకు చేరుకొన్నట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది.
బ్యాంకులు (Banks) జారీ చేస్తున్న విద్యారుణాల(Education Loan) శాతం తగ్గిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం కంటే 2022వ సంవత్సరం జనవరిలో విద్యార్థులకు బ్యాంకు రుణాలు దాదాపు 6 శాతం తగ్గి రూ.63,000 కోట్లకు చేరుకొన్నట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. బ్యాంకుల విద్యా రుణాల పోర్ట్ఫోలియో 2020వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం మధ్య 3.7 శాతంగా ఉంది. 2021వ సంవత్సరం నుంచి 2022వ సంవత్సరం మధ్య 2.4 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2020వ సంవత్సరం జనవరిలో విద్యా రుణాలు రూ.67,000 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మొత్తం వ్యక్తిగత రుణ విభాగం వృద్ధి చెందింది. అంతకు ముందు సంవత్సరం 8.7 శాతం వృద్ధితో పోలిస్తే 2022 జనవరి 11.6 శాతానికి పెరిగింది.
బ్యాంకుల భయానికి కారణాలు ఏంటి?
కరోనా కాలంలో ఉద్యోగాల్లో కోతలు, వేతనాల్లో కోతలు, మరణాలు, ఇతర ప్రతికూలతలు వంటివి విద్యార్థులకు అందజేసే రుణాలపై ప్రభావం చూపాయి. రుణాలు ఇచ్చే సమయంలో జాగ్రత్త వహించాలని బ్యాంకర్లు, విశ్లేషకులు తెలిపారు. కరోనా కాలంలో ఎదురైన సమస్యలు రుణగ్రహీతలు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయని బ్యాంకులు భయపడుతున్నాయి.
ఈ విషయంపై బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. ‘కరోనా ఎక్కువగా విద్యా వ్యవస్థను ప్రభావితం చేసింది. ఉద్యోగ ఖాళీలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విద్యార్థి సరైన ఉద్యోగం పొందలేకపోతే, లోన్ తిరిగి చెల్లించలేకపోయే అవకాశం ఉంది. అందుకే బ్యాంకులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.’ అని చెప్పారు.
మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయంతో రుణదాతలు వెనక్కి తగ్గుతున్న సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని, ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల రుణ ఎగవేత కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్యాంకులకు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోతే.. భవిష్యత్తులో విద్యా రుణం పొందడం మరింత సవాలుగా మారే అవకాశం ఉందన్నారు.
మరో బ్యాంకు అధికారి మాట్లాడుతూ.. ‘విద్యా రుణాలు, ప్రత్యేకించి చిన్న సైజు రుణాలను పంపిణీ చేయడానికి బ్యాంకులు ప్రత్యేకంగా భయపడుతున్నాయి. ఉక్రెయిన్లోని విద్యార్థుల పరిస్థితిని చూసి, విద్యా విభాగంలో మొండి బకాయిలు పెరుగుతాయని ఆలోచిస్తున్నాయి.’ అని తెలిపారు. ఎడ్యుకేషన్ లోన్లు సహజంగానే ప్రమాదకరమని, ఎందుకంటే అలాంటి చాలా రుణాలకు అంతర్లీన తాకట్టు ఉండదని ఓ రేటింగ్ కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు.
విద్యార్థి క్రెడిట్ కార్డులు
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడం కూడా విద్యా రుణాల తగ్గుదలకు దోహదపడిందని ఓ బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారి తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్య కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ పథకాల కింద ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.
కళాశాల స్థాయిలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు విద్యార్థి క్రెడిట్ కార్డ్ అందిస్తారు. దీనికి ఆదాయ అర్హత పరిమితి లేదు. ఈ క్రెడిట్ కార్డులు ఐదు సంవత్సరాల చెల్లుబాటుతో తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి. విద్యార్థులు తమ ఖర్చులను సొంతంగా నిర్వహించుకునేలా ఇటీవల కొన్ని బ్యాంకులు వీటిని ప్రవేశపెట్టాయి. ప్రయాణ నిషేధాల కారణంగా చాలా మంది విద్యార్థులు తమ కోర్సులను, ముఖ్యంగా విదేశాలలో విద్యను ఎంచుకునే వారు వాయిదా వేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుదల
2021 మార్చిలో ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు జారీ చేసిన విద్యా రుణాలలో 9 శాతానికి పైగా నిరర్థక ఆస్తులుగా మారాయి. మొత్తం విద్యా రుణాలలో 366,260 ఖాతాలకు చెందిన రూ.8,587 కోట్ల వవిలువైనవి బ్యాడ్లోన్స్గా మారాయని మంత్రిత్వ శాఖ డేటా చూపించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.