కేంద్ర ప్రభుత్వం (Central Government) కొన్నేళ్లుగా విద్యా రంగం (Education Sector)లో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ బడ్జెట్లో అదే లక్ష్యంతో కేటాయింపులు చేసింది. బడ్జెట్లో విద్య, నైపుణ్యాలకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యారంగానికి రూ.1,12,899 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో దీని వాటా 2.5 శాతం కాగా ఇందులో పాఠశాల విద్యా విభాగానికి రూ.68,805 కోట్లు, ఉన్నత విద్యా విభాగానికి రూ.44,094 కోట్లు కేటాయించారు. అదే విధంగా పిల్లలో చదివే అలవాటును ప్రోత్సహించడానికి పాఠ్యేతర పుస్తకాలను ఇంగ్లీష్‌తో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రచురించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేలా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించి విశేషాలు ఏంటంటే..
* నైపుణ్యాలు పెంచేందుకు కృషి
ఉద్యోగాలు సాధించేలా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి జాతీయ విద్యా విధానం (NEP) 2020 రూపొందించబడింది. మూడేళ్లల్లో లక్షల మంది యువత నైపుణ్యం సాధించేలా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0ను ప్రారంభించనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. పరిశ్రమల భాగస్వామ్యంతో వాటి అవసరాలకు అనుగుణంగా కోర్సులు ఉంటాయన్నారు. ఏ.ఐ (Artificial Intelligence), రోబోటిక్స్, కోడింగ్, మెకాట్రానిక్స్, డ్రోన్స్ తయారీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలకు సంబంధించి ఈ పథకంలో కోర్సులు ఉంటాయన్నారు.
టాప్ విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు. దీంతో ‘మేక్ ఏ.ఐ ఇన్ ఇండియా, మేక్ ఏ.ఐ వర్క్ ఫర్ ఇండియా’ కల సాకారం అవుతుందన్నారు. అంతర్జాతీయంగా అవకాశాలు అందిపుచ్చుకునేలా వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ కింద మూడేళ్లల్లో 47 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. అటు అభ్యర్థులు, ఇటు ఎం.ఎస్.ఎం.ఈ (MSME)ల అవసరాలు తీర్చేలా డిజిటల్ ప్లాట్‌ఫారం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
* ఏకలవ్య మోడల్ పాఠశాలలు
గిరిజన పిల్లల్లో అక్షరాస్యతను పెంచడానికి రానున్న మూడు సంవత్సరాలలో టీచర్లను, సహాయ సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. 740 ఏకలవ్య పాఠశాలల్లో 3.5 లక్షల మంది గిరిజన పిల్లలు చదువుతుండగా వారి కోసం 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయ సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా వీరికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
* పిల్లల్లో చదివే అలవాటు పెంచేందుకు చర్యలు
కొవిడ్ కారణంగా విద్యారంగానికి అపార నష్టం జరిగింది. పిల్లల్లో పఠన సామర్థ్యం తగ్గింది. వారిలో పుస్తకాలు చదివే అలావాటు పెంచడానికి భారతీయ భాషలు, ఇంగ్లీష్‌తో పాఠ్యేతర పుస్తకాలు ప్రచురించనున్నట్లు ప్రకటించారు. నేషనల్ బుక్ ట్రస్ట్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ వంటి వాటి సాయంతో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీలను తేనున్నారు. ఫిజికల్ లైబ్రరీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించనున్నారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్.జీ.వోల సాయం తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Career and Courses, EDUCATION, Nirmala sitharaman