ఒక ఫోన్ కాల్ (Phone call)చేయడానికి సాధారణంగా మనకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈరోజుల్లో ఉచితంగానే చేసుకుంటున్నాం. కానీ, ఒకే ఒక్క ఫోన్ కాల్ విలువ రూ.లక్ష అంటే నమ్మగలరా? ముంబైMumbaiకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ (Startup company)ఉద్యోగులకు ఇలా 1,00,000 రూపాయలు జరిమానా (Fine)విధిస్తుంది. ఆఫీసులో ఫోన్ మాట్లాడితే రూ.లక్ష ఫైన్ అని అనుకుంటున్నారు కదూ..! అయితే మీరు పొరబడినట్లే. మీరనుకున్నట్లు ఫోన్ మాట్లాడటం వల్ల వేసే జరిమానా కాదు. ఇక ఆ విశేషాలేంటో తెలుసుకోవాలని ఉందా? వెంటనే ఇది చదివేయండి.
డ్రీమ్ స్పోర్ట్స్ నిర్ణయం
ఎవరైనా ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు కంపెనీ నుంచి ఫోన్ వస్తే చాలా చిరాకేస్తుంది. సెలవు రోజుల్లో కూడా వదలరా? అంటూ ఆ ఉద్యోగి ఇబ్బంది పడుతుంటాడు. ఫలితంగా సెలవుల అనంతరం అతడి పర్ఫార్మెన్స్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీంతో కంపెనీ ఉత్పాదకత తగ్గే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని, ముంబైకి చెందిన డ్రీమ్ స్పోర్ట్స్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఓ తీర్మానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు సహోద్యోగులు పని పరంగా డిస్టర్బ్ చేయకూడదని, అలా చేసిన వారు రూ.1 లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది.
స్వేచ్ఛకు భంగం కలగొద్దని
ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫాం ‘డ్రీమ్ 11’ని నిర్వహిస్తున్న సంస్థే డ్రీమ్ స్పోర్ట్స్. ఏడాదిలో ఒకసారి ఉద్యోగులకు కంపెనీ వారం రోజుల పాటు వెకేషన్ సెలవును మంజూరు చేస్తోంది. ఈ వారం రోజుల్లో ఉద్యోగి కంపెనీకి సంబంధించిన ఎలాంటి విషయాలను పట్టించుకోనవసరం లేదు. తనదైన ప్రపంచంలో విహరించేందుకు, తనకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టిచ్చేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ సమయంలో వృత్తి పరమైన అవసరాల కోసం సహోద్యోగులు సదరు ఉద్యోగికి ఫోన్ చేయడం వల్ల అతడి స్వేచ్ఛకు, గౌరవానికి భంగం కలిగించినట్లు అవుతుందని డ్రీమ్ స్పోర్ట్స్ భావించింది.
నో కాల్స్, ఈమెయిల్స్..
ఉద్యోగి సెలవు మూడ్‌ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ రూల్ తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈవో, కో ఫౌండర్ హర్ష జైన్ వెల్లడించారు. సంవత్సరంలో ఒకసారి వారం రోజుల పాటు వృత్తి వ్యవస్థ నుంచి ఉద్యోగులకు పూర్తిగా విముక్తి కల్పిస్తున్నట్లు జైన్ సీఎన్‌బీసీ ఛానల్‌తో తెలిపారు. ఈ సమయంలో ఉద్యోగికి ఫోన్లు, ఈ మెయిళ్లు, స్లాక్‌ల రూపంలో అంతరాయాలు ఉండబోవని స్పష్టం చేశారు.
రెండు రకాల ప్రయోజనాలు..
ఇలా చేయడం వల్ల రెండు రకాలుగా లబ్ధి చేకూరుతుందని జైన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగి సెలవును గౌరవించడంతో పాటు, కంపెనీ స్థితిగతులపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు. ఏయే ఉద్యోగులపై కంపెనీ ఆధారపడి పనిచేస్తుందనే విషయం సులువుగా తెలిసిపోతుందని చెప్పారు. చాలా రోజులుగా ఇది పకడ్బందీగా అమలవుతోందని జైన్ స్పష్టం చేశారు. సెలవుల్లో సదరు ఉద్యోగి నూతనోత్తేజాన్ని పొందాక.. తిరిగి ఆఫీసులో మరింత సమర్థవంతంగా పనిచేయగలడని కంపెనీ సీవోవో భవిత్ సేత్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mumbai, National News, Private Jobs