Indian Constitution: సమాజంలో నానాటికీ మహిళలపై వేధింపులు, అరాచకాలు పెరిగిపోతున్నాయి. అవాంఛనీయ, హింసాత్మక ఘటనల గురించి రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇల్లు, ఆఫీసు, బడి, గుడి, బజారు ఇలా ప్రతిచోట ఏదో ఒక మూల మహిళ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు తమకున్న హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాధలను భరించకుండా.. ఎదిరించే ఆత్మస్థైర్యం కోసం రాజ్యాంగంలో మహిళలకు ఉన్న హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. వారి పరిరక్షణకు రాజ్యాంగం ఎలాంటి హామీలు ఇస్తోందో, ఎలాంటి చట్టాలు ఉన్నాయో ? 'క్లాసెస్ విత్ న్యూస్18'(#ClassesWithNews18)లో భాగంగా తెలుసుకుందాం రండి.
సమానత్వపు హక్కు అందరికీ వర్తిస్తుంది
భారత రాజ్యాంగంలో మహిళలు, పిల్లల హక్కులను పరిరక్షించే చట్టాలు చాలా ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు రాజ్యాంగ హక్కుల గురించి చెబుతున్నప్పటికీ చాలా మందికి, ముఖ్యంగా మహిళలకు వాటి గురించి తెలియదు. మహిళల హక్కులను రాజ్యాంగపరమైన, చట్టపరమైన హక్కులుగా విభజించవచ్చు. రాజ్యాంగంలోని.. సమానత్వపు హక్కు అందరికీ వర్తిస్తుంది. జెండర్ ఆధారంగా ఉపాధిలో వివక్ష లేదు. తగిన జీవనోపాధి, సమాన పనికి సమాన వేతనం, ప్రసూతి సెలవులు వంటివి రాజ్యాంగపరంగా ఉన్న హక్కులు. ఇక చట్టాలను పరిశీలిస్తే..
పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల(నివారణ) చట్టం, 2013
పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం ఇది. దీనితో వర్క్ ప్లేస్‌లో లైంగిక వేధింపులు, అసభ్యకరమైన సంభాషణలు, అసభ్యకరమైన భాషను వాడటం తగదు. ఇలాంటి విషయాలపై మహిళలు ఆఫీసులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)కి ఫిర్యాదు చేయవచ్చు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి కార్యాలయంలో ఈ ఐసీసీ అనేది తప్పక ఉండాలి. సహోద్యోగినితో పురుషులు మరీ దగ్గరగా మెలగడం, దుష్ప్రవర్తన, లైంగిక వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకరంగా ముట్టుకోవడం, విజిల్స్ వేయడం, అభ్యంతరకరమైన పాటలు పాడటం చేయడం చట్ట విరుద్ధం. వీటిని చట్ట రీత్యా నేరాలుగా పరిగణిస్తారు.
గృహ హింస చట్టం, 2005
మహిళలకు గృహ హింస నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన చట్టం ఇది. ఈ చట్టం కింద శారీరకంగా లేదా మానసికంగా ఇంటిలో ఎవరైనా మహిళలను ఇబ్బందులు పెడుతుంటే నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద గృహ హింస అంటే.. భౌతికపరమైనది అయి ఉండొచ్చు. లేదా లైంగిక వేధింపులు, తిట్టడం, భావోద్వేగాలను గాయపరచడం, ఆర్థిక దుర్వినియోగం లాంటివి అన్నీ దీని కిందికి వస్తాయి. గృహ హింసను ఎదుర్కొంటున్న స్త్రీలు అధికారుల నుంచి రక్షణ పొందవచ్చు. వీరు వైద్య సహాయం పొందడానికి, షెల్టర్ హోమ్‌లకు మారడానికి అర్హులు. ఇంకా వీరు నష్టపరిహారం కూడా కోరవచ్చు. బాధిత వ్యక్తికి సంక్షేమ నిపుణుల సలహాలు, సహాయాన్ని కూడా చట్టం అందిస్తుంది. మీరు ఇంట్లో ఉన్న భార్య, కుమార్తె అయి ఇలాంటి వేధింపులకు గురి అయితే ఈ చట్టం పరిధిలోకి వస్తారు.
సమాన వేతనం చట్టం
మహిళ, పురుషుడు అనే భేదం లేకుండా సమాన పనికి సమాన జీతం ఉండాల్సిందేనని ఈ ‘సమాన వేతన చట్టం’ చెబుతోంది. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి లింగ ఆధారిత వివక్ష ఉండకూడదని స్పష్టం చేస్తోంది.
బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006
2007లో బాల్య వివాహాల నిషేధ చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం వధువు వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ అయితే అది బాల్య వివాహం కిందికి వస్తుంది. తక్కువ వయస్సు ఉన్న బాల బాలికలకు పెళ్లి చేసేందుకు ప్రయత్నించే తల్లిదండ్రులపై ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.
Black Cumin Vastu : నల్ల నువ్వులతో ఇలా చెయ్యండి.. మీ ఇంట సిరుల పంట
వరకట్న నిషేధ చట్టం, 1961
ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం. వధువు లేదా వరుడు, వారి కుటుంబ సభ్యులకు వివాహం సమయంలో కట్నం ఇచ్చినా, పుచ్చుకున్నా జరిమానా విధిస్తారు. కనీసం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.15,000 జరిమానా ఉంటుంది. వివాహ సమయంలో స్త్రీకి ఇచ్చే కట్నం, ఆస్తి ఆమె మరణించిన సందర్భంలో ఆమె వారసులకు చెందుతుందని ఈ చట్టం చెబుతోంది.
మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధం) చట్టం, 1986
ఈ చట్టం ప్రకారం ప్రకటనలు, ప్రచురణలు, రచనలు, పెయింటింగ్‌లు, బొమ్మలు లేదా మరేదైనా పద్ధతిలో మహిళలను అసభ్యంగా చూపించడం నిషేధం.
హిందూ వారసత్వ చట్టం1956, హిందూ వివాహ చట్టం 1955
భారతదేశంలోని హిందూ మహిళలకు ఆస్తి, వారసత్వ హక్కులు.. ఈ హిందూ వారసత్వ చట్టం 1956, హిందూ వివాహ చట్టం 1955లలో ఉన్నాయి. బౌద్ధులు, జైనులు, సిక్కులు, ముస్లిం మహిళలకు కూడా సంబంధిత మతాలకు అనుగుణంగా ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్త్రీలు తమ తండ్రి ఆస్తి పై పురుషులతో సమానంగా హక్కు ఉంటుంది. భారతీయ వారసత్వ చట్టం 1925 ప్రకారం క్రైస్తవులు, పార్సీలు, యూదు మహిళలకు వారసత్వ నిబంధనలు భిన్నంగా ఉన్నాయి.
జాతీయ మహిళా కమిషన్ 1990
మహిళల హక్కులను పరిరక్షించే వివిధ చట్టాలు కాకుండా జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా ఉంది. ఇది జనవరి 1992లో ఏర్పాటైంది. ఇది భారత ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ. NCW భారత దేశంలోని మహిళల హక్కులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మహిళల స్థితిగతులను మెరుగుపరచడం, వారి ఆర్థిక సాధికారతకు కృషి చేయడం లక్ష్యంగా పని చేస్తుంది.
మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1861
ఈ చట్టం చట్టం ద్వారా మహిళలు ఉద్యోగినులు గా ఉన్నప్పుడు ప్రసూతి ప్రయోజనాలు పొందవచ్చు. ఆమె ప్రసవించే తేదీ కంటే ముందు నుంచి 12 నెలల వ్యవధిలో కనీసం 80 రోజుల పాటు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ఈ సెలవులతోపాటుగా నర్సింగ్ బ్రేక్స్, మెడికల్ ఎలవెన్సులు, ఇతర ప్రయోజనాలు పొందొచ్చు. సెలవుల్లో ఉన్నప్పటికీ యజమాని ఆమెకు రోజువారీ వేతనాన్ని చెల్లించాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Domestic Violence, Women harrasment