అన్ని రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డులు, కేంద్ర బోర్డులు 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ఇప్పటికే ప్రకటించాయి. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మాత్రం ఇప్పటికీ ఫలితాలను ప్రకటించలేదు. జులై చివరిలో 12వ తరగతి ఫలితాలను, ఆగస్టు మొదటి వారంలో పది ఫలితాలను సీబీఎస్‌ఈ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఏ తేదీన విడుదలవుతాయో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం గమనార్హం.
ఫలితాలను త్వరలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని.. అడ్మిషన్ ప్రక్రియలో కొంత విరామం (పాజ్) తీసుకోవాలని యూజీసీతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను సీబీఎస్‌ఈ కోరినట్లు సమాచారం. మరోవైపు సీఐఎస్‌సీఈ(CISCE) కూడా తమ ఐఎస్‌సీ(ISC) లేదా 12వ తరగతి ఫలితాలను పాజ్‌లో ఉంచింది. ఇందుకు సీబీఎస్‌ఈ ఫలితాలను ప్రకటించకపోవడమే కారణంగా తెలుస్తోంది.
ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. 50 లక్షలకు పైగా విద్యార్థులున్న యూపీ, రాజస్థాన్ బోర్డులు ఇప్పటికే పది, 12వ తరగతి ఫలితాలను ప్రకటించాయి. అయితే కేవలం 35 లక్షలలోపు విద్యార్థులున్న సీబీఎస్‌ఈ బోర్డు, ఇప్పటి వరకు ఫలితాలను ఎందుకు ప్రకటించలేకపోయిందని పలువురు విద్యా నిపుణులు విమర్శిస్తున్నారు.
సీబీఎస్‌ఈ ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పరీక్ష విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. మూల్యాంకనాన్ని కూడా ఎంతో పకడ్భందీగా చేపడుతోంది. సీబీఎస్‌ఈ ఈ ఏడాది రెండు పరీక్షల విధానాన్ని అవలంబించింది. వార్షిక బోర్డు పరీక్షలను రెండు సెమిస్టర్‌లుగా విభజించింది. మొత్తం సిలబస్‌లో ప్రతి సెమిస్టర్‌కు 50 శాతం కేటాయించింది. మరోపక్క కరోనా మహమ్మారి ముప్పు ఉన్నప్పటికీ రాజస్థాన్, యూపీ బోర్డులు తమ వార్షిక బోర్డు పరీక్షలు(Exams) షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాయి. దీంతో ఈ ఏడాది వాటి పరీక్ష ఫలితాల క్యాలిక్యులేషన్ విధానం మారలేదు. ఇక పంజాబ్ బోర్డ్, సీఐఎస్‌సీఈ వంటి బోర్డులు... సీబీఎస్‌ఈతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటారు.
విద్యార్థులకు సంబంధించి 2 కోట్లకు పైగా ఆన్సర్ బుక్‌లెట్లను సీబీఎస్ ఈ మూల్యాంకనం చేయాల్సి ఉంది. ఇందులో 12వ తరగతికి 114 సబ్జెక్టులు, 10వ తరగతిలో 74 సబ్జెక్టులతో విభిన్న సబ్జెక్ట్ కాంబినేషన్‌లు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ సబ్జెక్ట్ కాపీలను రెండుసార్లు తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫలితాల్లో టర్మ్ 1, టర్మ్ 2 మార్కులతో పాటు ఇంటర్నల్స్‌ను కలిపి ప్రకటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెండు టర్మ్‌ల్లో దేనినైనా రాయలేని విద్యార్థులకు కూడా సీబీఎస్‌ఈ మార్కులను ప్రకటిస్తుంది. దీంతో అలాంటి విద్యార్థుల డేటా భిన్నంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది.
కాగా, ఆన్సర్ షీట్‌లను మూల్యాంకనం చేయడానికి సీబీఎస్‌ఈ పెద్ద సంఖ్యలో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే వీటిని భారీగా పెంచింది. ప్రతి రోజు చెక్ ఇన్ చేయడానికి కాపీల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు సీబీఎస్‌ఈ గతంలో ప్రకటించింది. ఆన్సర్ షీట్‌ను ఒకసారి చెక్ చేసిన తరువాత మరోసారి మూల్యాంకనం చేసేవారు చెక్ చేయనున్నారు. తద్వారా మొత్తం మార్కులను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండదని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, రెండో చెక్ ద్వారా దాన్ని సరిదిద్దుతామని తెలిపింది. ఫలితాలను వంద శాతం కచ్చితత్వంతో ప్రకటించడానికి ఈ పద్ధతులు అనుసరిస్తున్నామని తద్వారా ఫలితాల ప్రకటన కొంత ఆలస్యమైందని సీబీఎస్‌ఈ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cbse results, Exams, JOBS