P Ramesh, News18, Kakinada
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలని భావిస్తుంటారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లించే స్థోమత లేక బాధపడుతుంటారు. ఐతే ప్రైవేట్ స్కూళ్లలోనూ ఉచిత విద్య పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం క్రింద ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాల పిల్లలకు 25 శాతం సీట్ల కేటాయింపు క్రింద 2023-24 విద్యా సంవత్సరానికి 1వ తరగతి లో విద్యార్థుల ప్రవేశం కొరకు అర్హులైన కుటుంబాలు ఏప్రిల్ 10వ తేదీ లోపు విద్యాశాఖ వెబ్ సైట్ http://cse.ap.gov.in ద్వారా ధరఖాస్తులను రిజిష్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ మేరకు ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో (IB/ICSE/CBSE/State Syllabus) 25 శాతం సీట్లలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు (అనాధ పిల్లలు, హెచ్ఐవి బాధిత పిల్లలు, దివ్యాంగులు) చెందిన పిల్లల కోసం 5 శాతం సీట్లు, ఎస్సీ లకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలు (బిసి, మైనారిటీ, ఓసి) చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించడం జరిగిందని కాకినాడ జిల్లా (Kakinada District) కలెక్టర్ కృతికాశుక్లా తెలిపారు. బలహీల వర్గాలకు చెందిన పిల్లల కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాలలో 1,20,000/- రూపాయలు , పట్టణ ప్రాంతాల్లో 1,44,000/- రూపాయలు అర్హతగా నిర్ణయించారు.
పరీక్షలకు IB/ICSE/CBSE సిలబస్ అనుసరించే పాఠశాలల్లో ప్రవేశం కోరే విద్యార్థి 1.4.2023 నాటికి, స్టేట్ సిలబస్ అనుసరించే పాఠశాలల్లో ప్రవేశం కోరే విద్యార్థి 1.6.2023 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ నివాస ప్రదేశానికి 1 నుండి 3 కిమీ దూరంలో గల ప్రైవేట్ పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి 1వ తరగతిలో తమ పిల్లల ప్రవేశానికి పైన తెలిపిన వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 10వ తేదీ లోపున రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రామ, వార్డు సచివాలయ డేటా ప్రకారం విద్యార్థుల అర్హత నిర్థారణ ప్రక్రియను ఏప్రియల్ 13 నుండి 17వ తేదీ వరకూ ఉంటుంది. ఏప్రియల్ 18వ తేదీన లాటరీ ద్వారా మొదటి విడత సీట్ల కేటాయింపు చేసి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకూ ప్రవేశాలను ధృవీకరిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 29వ తేదీన రెండవ విడత సీట్ల కేటాయింపు లాటరీ నిర్వహించి మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకూ విద్యార్థుల ప్రవేశాలను ధృవీకరిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు తమ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయంలో గాని, మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని, అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, EDUCATION, Local News