సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG-2023) రాస్తున్న విద్యార్థులకు ఢిల్లీ యూనివర్సిటీ కీలక సూచనలు చేసింది. ఏదైనా కోర్సును ఎంచుకునే ముందు ఆ విభాగంలో ఉండే సబ్జెక్టుల గురించి తెలుసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ యూనివర్సిటీ ఒక అడ్వైజరీ జారీ చేసింది. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్(CUET-UG) నిర్వహిస్తోంది. తాజాగా మార్చి 30 వరకు దరఖాస్తు ప్రక్రియను పొడిగించింది. అయితే చాలామంది విద్యార్థులు కోర్సు సెలక్షన్‌లో పొరబడుతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ గుర్తించింది. దీంతో విద్యార్థులకు ఈ విషయంపై సూచనలు చేసింది.
* డీటేల్స్ తెలుసుకోవాల్సిందే..
తాము ఏం చదవాలని భావిస్తున్నారో.. ఆ ప్రోగ్రామ్ గురించి విద్యార్థులు తప్పకుండా అవగాహన ఏర్పరుచుకోవాలని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఒక ఉదాహరణను వివరించింది. ఒక విద్యార్థి భాషా సంబంధిత కోర్సును ఎంచుకోవాలని అనుకుంటే.. సదరు విద్యార్థికి ముందుగా ఆ భాషకు సంబంధించిన పూర్వ జ్ఞానం కొంతైనా ఉండాలని తెలిపింది. ఆ భాషలో రాయడం, చదవడం తప్పకుండా రావాలని సూచించింది. తద్వారా అడ్మిషన్ కోసం యూనివర్సిటీతో పాటు ప్రోగ్రామ్స్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది.
* గతేడాది కూడా తప్పులు
గతేడాది సీయూఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం మందికి తాము ఎంచుకున్న కోర్సు గురించి పూర్తి అవగాహన లేదట. యూనివర్సిటీ పరిధిలో ఏదో ఒక మంచి కాలేజీలో సీటు దక్కించుకోవాలన్న ఆరాటంలో ఈ విషయంపై అభ్యర్థులు తగిన శ్రద్ధ వహించలేదని వర్సిటీ తెలిపింది. ఫలితంగా కోర్సులో చాలామంది విద్యార్థులు సతమతమయ్యారని గుర్తు చేసింది. కొందరు విద్యార్థులు ఏకంగా సబ్జెక్ట్స్ మార్పు కోరుతూ యూనివర్సిటీలకు అప్పీల్ చేసుకున్నారని తెలిపింది.
ఇది కూడా చదవండి : ప్రముఖ బ్యాంకులో 638 ఉద్యోగాలు .. జీతం రూ.1.35 లక్షలు..!
* యూనివర్సిటీకే ప్రాధాన్యం..
కోర్సు కన్నా యూనివర్సిటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా చాలామంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. గతేడాది బీఏ ప్రోగ్రామ్స్‌లో ఇలా విద్యార్థులు తికమక పడ్డారని స్పష్టం చేసింది. తాము ఎంచుకున్న కోర్సుల్లో ఉండే సబ్జెక్టుల గురించి తెలియకుండానే విద్యార్థులు యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందారట. విద్యార్థులకు తగిన నైపుణ్యాలు లేనప్పటికీ ఆయా కోర్సులను ఎంచుకోవడం వల్ల మనుగడ సాధించలేక పోతున్నారని తెలిపింది.
సీయూఈటీ స్కోరు ద్వారా
2023 సీయూఈటీ స్కోరు ఆధారంగానే విద్యార్థికి సీటు కల్పిస్తామని ఢిల్లీ యూనివర్సిటీ స్పష్టం చేసింది. దీనితో పాటు అభ్యర్థులు కామన్ సీట్ అలకేషన్ సిస్టమ్ అండర్‌గ్రాడ్యుయేట్(CSAS- UG) అప్లికేషన్ ఫారం నింపాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో ప్రోగ్రామ్, కాలేజ్ కాంబినేషన్ వివరాలు నింపాలని, ఒకసారి అడ్మిషన్ పొందిన తర్వాత విద్యార్థులు ప్రోగ్రామ్‌లను మార్చుకోవడానికి వీలుండదని స్పష్టం చేసింది.
13 భాషల్లో పరీక్ష..
సీయూఈటీ యూజీ-2023 ప్రవేశ పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, ఒడియా, పంజాబీతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CUET 2023, Delhi University, EDUCATION, JOBS