DECISION ON SCHOOLS OPENING WILL BE TAKEN AFTER DUSSEHRA SAYS TELANGANA CABINET SUB COMITTEE SK
Telangana Schools: తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై కీలక ప్రకటన..
ప్రతీకాత్మక చిత్రం
అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, థియేటర్లు తెరవచ్చని కేంద్రం అన్‌లాక్ 5 మార్గదర్శకాల్లో చెప్పినప్పటికీ.. తుది నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడే స్కూళ్లను తెరవద్దని మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది.
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా 8 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసి నేరుగా పాస్ చేశారు. ఐతే లాక్డౌన్లో భాగంగా ప్రస్తుతం అన్‌లాక్-5 నడుస్తోంది. ఇందులో ఎన్నో ఆంక్షలకు కేంద్ర ప్రభుత్వ సడలింపులు ఇచ్చింది. అక్టోబరు 15 నుంచి స్కూళ్లు, థియేటర్లు తెరవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. దాన్ని యథావిధిగా అమలు చేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐతే తెలంగాణలో మాత్రం ఇప్పట్లో స్కూళ్లు తెరచుకునే అవకాశం కనిపించడం లేదు. దసరా తర్వాతే స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, నిర్వహణ సహా పలు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు సబితారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. అక్టోబరు 15 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభం సాధ్యం కాదని సమావేశం అనంతరం మంత్రులు స్పష్టం చేశారు. బతుకమ్మ, దసరా పండుగల తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కేరళలో ఓనం పండుగ తర్వాత కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చిందని.. ఈ క్రమంలో తెలంగాణలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరమని అభిప్రాయపడ్డారు.
పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఇతర విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులు విధివిధానాలను రూపొందించిన తర్వాత.. వాటి ఆధారంగా సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఐతే ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు మాత్రం నవంబరు 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ''రాష్ట్రంలో 86 శాతంమందికి ఆన్లైన్ విద్య అందుతుందని ఓ సర్వే ద్వారా తేలింది. రానున్న రోజుల్లో విద్యార్థులకు డిజిటల్ బోధన తప్పనిసరి. పాఠశాలల్లో వసతుల నిర్వహణను స్థానిక సంస్థలకు అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో దానిపైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.'' అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సమష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇది ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాదు.. వారి ఆరోగ్యం కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. స్కూళ్ల రీఓపెనింగ్‌కు సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్స్ లేని కారణంగా విద్యార్థులు ఆన్ లైన్ విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
విద్యాసంస్థల ప్రారంభంపై అన్ని కోణాల్లో ఆలోచించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో ఒకే విధమైన నిబంధనలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, థియేటర్లు తెరవచ్చని కేంద్రం అన్‌లాక్ 5 మార్గదర్శకాల్లో చెప్పినప్పటికీ.. తుది నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడే స్కూళ్లను తెరవద్దని మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. దసరా తర్వాతే స్కూళ్ల రీఓపెనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అప్పటి వరకు ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలను బోధిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.