అన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం బోర్డు పరీక్షల ప్రక్రియను ఏమాత్రం ప్రభావితం చేయదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సమీప భవిష్యత్తులో 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసే ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. నూతన జాతీయ విద్యా విధానం (NEP- New Education Policy)- 2020కి అనుగుణంగా అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని గత నెలలో కేంద్రం ప్రకటించింది. అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాఠశాలల పరీక్షలను అసంబద్ధం చేస్తున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీబీఎస్ఈ పాఠశాలల్లో పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నట్లని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీలోని 400కు పైగా ప్రైవేట్ పాఠశాలల కన్సార్టియం నేషనల్ ప్రోగ్రెసివ్ స్కూల్స్ కాన్ఫరెన్స్(NPSC).. CUETతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లలో 12వ తరగతి మార్కులకు వెయిటేజీ కల్పించాలని అభ్యర్థిస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు గత నెలలో లేఖ రాసింది. పాఠశాల విద్య ఉద్దేశాన్ని సీయూఈటీ దెబ్బ తీస్తోందని ఆరోపించింది.
ఈ విషయంపై సీబీఎస్ఈ కార్యదర్శి (అడ్మినిస్ట్రేషన్, అఫిలియేషన్ అండ్ ఫైనాన్స్) అనురాగ్ త్రిపాఠి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సాధారణ ప్రవేశ పరీక్షకు బోర్డు మూల్యాంకన ప్రక్రియకు ఎటువంటి సంబంధం లేదు. CBSE 10, 12వ తరగతులకు బోర్డు పరీక్షలను నిర్వహించడం కొనసాగుతుంది. ఈ పరీక్షలను రద్దు చేసే ఆలోచన లేదు. CUET నిర్వహణ వాస్తవానికి పాఠశాలల్లో విద్యార్థుల ఏకాగ్రతను పెంచుతుంది. ఎందుకంటే వారు పూర్తిగా 12వ తరగతి సిలబస్‌పై ఆధారపడిన ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇది గతంలో కంటే కష్టపడి చదవడానికి వారిని ప్రేరేపిస్తుంది. దేశంలో CBSE మాత్రమే కాకుండా వివిధ విద్యా బోర్డులు ఉన్నాయి. విద్యార్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఉన్నతాధికారులు సీయూఈటీలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ కల్పించలేదు.’ అని చెప్పారు.
NEET 2022: నీట్ 2022 కోసం ప్రిపేర్ అవుతున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే.. మంచి స్కోర్ మీ సొంతం..!
ప్రస్తుతం 26,000 పాఠశాలలతో అనుబంధంగా ఉన్న CBSE దేశంలోనే అతిపెద్ద విద్యా బోర్డు. గతేడాది 12వ తరగతిలో 1,369,745 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 10వ తరగతిలో 2,113,767 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ క్రమంలో బోర్డు పరీక్షల సరళిని మెరుగుపరచడానికి బోర్డు నిరంతరం కృషి చేస్తోందని అనురాగ్ త్రిపాఠి తెలిపారు.
‘ప్రశ్న పత్రాలలో 33 శాతం ఇంటర్నల్ ఆప్షన్ ప్రవేశపెట్టాం. పేపర్లలో సామర్థ్య ఆధారిత ప్రశ్నలను చేర్చడం ప్రారంభించాం. ఇలాంటి ప్రశ్నలు ప్రతి సంవత్సరం 10- 15 శాతం పెరుగుతాయి. విద్యార్థులకు రోట్ లెర్నింగ్ నుంచి దూరంగా ఉండటానికి విశ్లేషణాత్మక నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచనలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. మార్కుల కోసం మాత్రమే చదవడం తగ్గుతుంది.’ అని చెప్పారు.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి కటాఫ్‌లు 99 నుంచి 100 శాతానికి చేరుతున్న సమయంలో CUCET ని కేంద్రం ప్రవేశపెట్టింది. గత ఏడాది ఎనిమిది ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) కాలేజీలు 11 కోర్సుల్లో ప్రవేశానికి 100 శాతం కటాఫ్‌ను ప్రకటించాయి. CUET నిర్వహణతో డీయూ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు 12వ తరగతి మార్కులను కనీస అర్హత ప్రమాణాలుగా మాత్రమే పరిగణించాలి. రాష్ట్ర , ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మెరిట్ ఆధారిత ప్రవేశాల కోసం బోర్డు పరీక్ష మార్కులను ఉపయోగించడం కొనసాగించవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.