నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాస్త ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు ఈ తేదీని ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. అప్లికేషన్ విండో మే 6 సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజులను రాత్రి 11.50 గంటలలోపు సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌టీఏ కోరింది. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకు ఆలస్యమైందనే విషయాన్ని ఏజెన్సీ వెల్లడించలేదు.
సీయూఈటీ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (MCQs) ఫార్మాట్‌లో జరిగే కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (CBT). ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జూలై మొదటి, రెండో వారంలో జరుగుతుంది. CUET (UG) 2022 ద్వారా 2022-23 అకడమిక్ సెషన్ సీట్లను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు సింగిల్ విండో అవకాశాన్ని ఈ పరీక్ష అందిస్తుంది.
ఈ పరీక్ష ఫస్ట్ స్లాట్ 195 నిమిషాలు, సెకండ్ స్లాట్ 225 నిమిషాలు ఉంటుంది. పేపర్ మొత్తం 13 భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మీడియంను అభ్యర్థులు ఎంచుకోవచ్చు. సెక్షన్ IA, IB, II, III వంటి నాలుగు సెషన్‌లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
CUET కోసం ఎలా దరఖాస్తు చేయాలి
అభ్యర్థులు CUET అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి.. CUET 2022 అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలను నింపి దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం ఈ అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవడం మంచిది.
దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్.. ‘CUET (UG) 2022 కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ముందు https://cuet.samarth.ac.in, www.nta.ac.inలో పొందుపరచిన ఇన్‌ఫర్మేషన్ బులెటిన్‌ను చదవాలి. పార్టిసిపేటింగ్ యూనివర్సిటీలు/ ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న ప్రాస్పెక్టస్‌ను చదవవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు అర్హత, పథకం/వ్యవధి/సమయాలు/మధ్యస్థం/పరీక్ష ఫీజు, సిలబస్, పరీక్ష నగరాలు, ముఖ్యమైన తేదీలు, అడ్మిషన్ విధానం.. వంటి వాటిని గుర్తుంచుకోవాలి’ అని పేర్కొంది.
అన్ని వర్సిటీల్లోనూ ప్రవేశాలు..
ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీతో పాటు అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి కూడా ఈ స్కోర్ ఉపయోగపడుతుంది. జామియా హమ్‌దార్డ్, TISS వంటి అగ్రశ్రేణి కళాశాలలు CUET ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు ఆసక్తి చూపించాయి. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని విద్యా సంస్థలు ప్రకటించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.