news18-telugu
Updated: November 20, 2020, 3:16 PM IST
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేంద్రంపై యుద్ధ ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తాజాగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సందధించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఉద్యోగ పరీక్షలను హిందీ, ఇంగ్లీష్‌లోనే నిర్వహించడం వల్లే ప్రాంతీయ భాషలో చదుకున్న విద్యార్థులు నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోని విద్యార్థులు, హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని సీఎం కేసీఆర్ వాపోయారు. దేశవ్యాప్తంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, బ్యాంకులు, డిఫెన్స్ సర్వీసెస్ ఉద్యోగ నియామక పరీక్షలను హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోటీ పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు యూపీఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరారు.
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోందని.. ప్రజలను చైతన్యపరచేందుకు హైదరాబాద్ నుంచే యుద్ధం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. భాజపా కాంగ్రెస్ దొందూ దొందేనని..ఈ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని.. దేశం నూతన మార్గం పట్టాలని ఆయన అన్నారు.
దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని కేసీఆర్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, శరద్‌పవార్, ప్రకాశ్‌సింగ్ బాదల్, కుమారస్వామితో పాటు సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడానని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించామన్న ఆయన.. కలిసి వచ్చే నేతలతో కలిసి డిసెంబరు రెండో వారంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను తెలుగులో నిర్వహించాలని లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
Published by:
Shiva Kumar Addula
First published:
November 20, 2020, 3:16 PM IST