Home /News /jobs /

CIVIL SERVICES EXAMS CANT BE POSTPONED OVER COVID UPSC TO SUPREME COURT SK

Civil Services Exams: సివిల్ సర్వీసెస్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన UPSC

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విచారణ సందర్భంగా సివిల్ సర్వీస్ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబరు 4 నుంచి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.

    దేశంలో కరోనా విజృంభిస్తున్న ఇప్పటికే ఎన్నో ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఐతే అన్‌లాక్ 4లో భాగంగా ఈ నెలలో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో నీట్ (NEET 2020), జేఈఈ మెయిన్ (JEE) పరీక్షలను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎంతో మంది కోర్టుల్లో కేసులు వేసినప్పటికీ.. పరీక్షలను నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఐతే తాజాగా సివిల్ సర్వీస్ పరీక్షల వ్యవహారం కూడా సుప్రీంకోర్టుకు చేరింది. కరోనా మహమ్మారి విజృంభించడంతో పాటు దేశవ్యాప్తంగా వరదల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రేపటి లోగా అఫిడవిట్ సమర్పించాలని UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)కు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబరు 23కు వాయిదా వేసింది.

    విచారణ సందర్భంగా సివిల్ సర్వీస్ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబరు 4 నుంచి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.

    వాస్తవానికి మే 31నే సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలను అక్టోబరు 4కు వాయిదా వేశారు. ఐతే ప్రస్తుతం భారీగా కరోనా కేసులు నమోదవుతుండడం, దేశవ్యాప్తంగా వరదల నేపథ్యంలో.. సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 20 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షను జేఈఈ, నీట్ వంటి పరీక్షలతో పోల్చకూడదని.. ఆ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే అవకాశముంటుందని, కానీ సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేస్తే అలా పరిస్థితేమీ ఉండదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్నాళ్లు వాయిదా వేసినంత మాత్రాన ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.

    ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహించడమంటే అభ్యర్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమేనని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. పిటిషన్ వేసిన ఓ అభ్యర్థి తండ్రి మాట్లాడుతూ... ప్రస్తుతం మా అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని.. కోవిడ్ పరిస్థితుల్లో పనిభారం కారణంగా సివిల్ సర్వీస్ పరీక్షలకు సరైన విధంగా సన్నద్ధం కాలేకపోతున్నాడని పేర్కొన్నారు. సెలవులు పెట్టి పరీక్షలను ప్రిపేర్ అయ్యే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. కానీ మిగతా వారు మాత్రం ఇళ్లల్లో కూర్చొని పరీక్షలను సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే తమ కుమారుడిలాంటి వారు ఎంతో మంది నష్టపోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరీక్షలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

    కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన నీట్, జేఈఈ పరీక్షలను ఈ నెలలో నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, సినీ నటులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలంటే మీకు లెక్క లేదా అని మండిపడ్డారు. ఐనప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలను నిర్వహించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Civil Services, Exams, Supreme Court, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు