విదేశీ పర్యాటకులకు, విద్యార్థులకు చైనా ప్రభుత్వం (China Government) గుడ్‌న్యూస్ చెప్పింది. విదేశీయులపై అమలులో ఉన్న వీసా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నేడు(మార్చి 14న) ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. కోవిడ్ లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. చైనా ప్రభుత్వ నిర్ణయంతో చాలా మంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
చైనాలో కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి కారణంగా అక్కడి ప్రభుత్వం కట్టడి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్ విధించింది. విద్యా సంస్థలు, పర్యాటక ప్రదేశాలపై ఆంక్షలను అమలు చేసింది. చైనాలో ఉన్న విదేశీయులను సైతం అక్కడి నుంచి పంపించింది. దీంతో చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువులను ఆపేసి స్వదేశాలకు తిరిగి వెళ్లారు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులు కూడా ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. మళ్ళీ చైనాకు వెళ్లడానికి అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
* రేపటి నుంచి అమలు
విదేశీ పర్యాటకులకు, విద్యార్థులకు, ఇతరులకు వీసా మంజూరు ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సడలింపు రేపటి(మార్చి 15) నుంచే అమలులోకి రానుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. దీంతో అభ్యర్థులు వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వీసాలను రివ్యూ చేయడం, అప్రూవ్ చేయడంతో పాటు 2020 మార్చి 28కి ముందు వీసా పొందిన వారికి కూడా ప్రవేశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే, సదరు వీసాకు వ్యాలిడిటీ తప్పనిసరి.
ఇది కూడా చదవండి : ఢిల్లీ యూనివర్సిటీలో జాబ్స్.. రూ.50వేలకు పైగా జీతం..
* ఇదే ఉద్దేశం
క్రాస్ బార్డర్ ట్రావెల్‌ని సులభతరం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. తద్వారా చైనాలోకి అధిక సంఖ్యలో విదేశీయులు తరలివచ్చే సౌలభ్యం కలుగుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చైనీయులు కూడా ఇతర దేశాల్లో పర్యటించడానికి సులభం అవుతుందని అభిప్రాయపడింది. మార్చి 15 నుంచి ఇమ్మిగ్రేషన్ అధికారులు అన్ని రకాల వీసాలను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.
వీసా లేకుండానే ఎంట్రీ..
వీసా రహిత ప్రయాణాలను పున: ప్రారంభించి, వాటిని మరింత మెరుగు పరచడానికి చైనా ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ మేరకు వీసా మంజూరు ప్రక్రియలో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. క్రూయిజ్ షిప్పుల ద్వారా షాంఘై నగరానికి చేరుకునే వారికి వీసా లేకున్నా దేశంలోకి అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఆసియా పరిధిలోని పలు పర్యాటక బృందాలకు, హాంగ్‌కాంగ్, మకావ్ నుంచి వచ్చే టూరిస్టులకు కూడా వీసా నిబంధనను ఎత్తివేయాలని చైనా ఆలోచిస్తోంది.
కొత్త వారికి కూడా..
గతేడాది లాక్‌డౌన్ విధింపు నిర్ణయం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు నష్టపోయారు. దీనిపై చైనా అంబాసిడర్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. చైనాలో త్వరలోనే భారతీయ విద్యార్థులు తమ చదువులను కొనసాగించే వీలుంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వీసా ఆంక్షలను ఎత్తివేయడంతో విద్యార్థులు తమ చదువులను మళ్ళీ కొనసాగించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, China, EDUCATION, JOBS, Visa