news18-telugu
Updated: October 12, 2020, 7:16 AM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా కారణంగా తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఈ ఏడాది ఆలస్యంగా నిర్వహించారు. ఈ నెల 6న ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పలు కారణాల రిత్యా ఈ నెల 12(నేటి) నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగంలో నూతనంగా ప్రవేశపెట్టిన కోర్సులకు ప్రభుత్వం నుంచి ఇంకా పర్మిషన్ రాకపోవడంతో పాటు కళాశాలలకు అఫిలియేషన్ జారీ ప్రక్రియ పూర్తి కాకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎంసెట్–2020 కౌన్సెలింగ్ షెడ్యూల్లో నిర్వాహకులు పలు మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం ఈనెల 9 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మొదలైంది. ఈ నెల 12 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ నెల 18 నుంచి 22వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేలా అవకాశం షెడ్యూల్ లో మార్పులు చేశారు. అనంతరం ఈనెల 24న ఆ అభ్యర్థులకు సీట్లు కేటాయింపు చేస్తారు. అనంతరం సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 28 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
కరోనా కారణంతో..తెలంగాణలో మొత్తం 201 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలోని పలు బీటెక్ కోర్సుల్లో 1,10,873 సీట్లు ఉన్నాయి. ప్రతీ కాలేజీకి యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుంది. సాధారణంగా మే నెల చివరి వరకే మే నెల ఆఖరి వరకే ఈ అఫిలియేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో అఫిలియేషన్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. దీంతో ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ మొదలైనా అఫిలియేషన్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
Revised Schedule-Direct Link
కొత్త కోర్సులకు రాని ఆమోదం..
రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలు ఈ విద్యా సంవత్సరంలో పలు కోర్సులను నూతనంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఏఐసీటీకీ దరఖాస్తు చేసుకోగా అంగీకరించింది. అయితే కొత్త కోర్సులను, తద్వారా పెరబోయే సీట్ల సంఖ్యను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాకపోవడం కౌన్సెలింగ్ కు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా రివైజ్డ్ షెడ్యూల్ జారీ చేశారు. పలు కళాశాలల్లో బీటెక్ లో కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తే ఈ ఏడాది ఇంజనీరింగ్ లో మరో 15,690 సీట్లు పెరగనున్నాయి.
Published by:
Nikhil Kumar S
First published:
October 12, 2020, 7:07 AM IST