CENTRE TO INTRODUCE LAW COURSES IN REGIONAL LANGUAGES GH VB
Law Courses: ప్రాంతీయ భాషల్లో లా కోర్సులు.. త్వరలో ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం..
ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని విద్యారంగంలో సమూల మార్పులు చేయడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త జాతీయ విద్యా విధానాన్ని (National Education Policy) 2020లో ప్రకటించింది.
దేశంలోని విద్యారంగంలో సమూల మార్పులు చేయడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త జాతీయ విద్యా విధానాన్ని (National Education Policy) 2020లో ప్రకటించింది. ఇందులో భాగంగా న్యాయశాస్త్రానికి సంబంధించిన కోర్సులను ప్రాంతీయ భాషల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం(Central) యోచిస్తోంది. మొదటి దశలో హిందీ(Hindi), తమిళం, మరాఠీ, బెంగాలీ, తెలుగు(Telugu) భాషల్లో కోర్సులను ప్రారంభించనున్నారు. తాజాగా లా కోర్సులను(Law Course) ప్రాంతీయ భాషల్లో అందించడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుందని హిందుస్థాన్ టైమ్స్ (Hindustan Times) వార్తాకథనం తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొన్ని ఉన్నత విద్యా సంస్థలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు చర్చలు సైతం ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రతిపాదిత చర్యలపై యూజీసీ చైర్పర్సన్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ... లా కోర్సులను ప్రాంతీయ భాషల్లో పూర్తిస్థాయి డిగ్రీ ప్రోగ్రాములుగా ప్రారంభించడం కమిషన్ లక్ష్యమన్నారు. న్యాయ కోర్సులను విద్యార్థులు ప్రాంతీయ భాషల్లో చదివితే ప్రయోజనం ఉంటుందన్నారు. న్యాయవాదులు సైతం పత్రాలను ప్రాంతీయ భాషల్లో తయారు చేయవచ్చని...వారు తమ క్లయింట్లతో మాతృభాషలో సంభాషించడంతో కలిగే ప్రయోజనాన్ని జగదీష్ కుమార్ నొక్కి చెప్పారని హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది.
స్థానిక కోర్టుల్లో సైతం ప్రాంతీయ భాషల్లో వాదనలు జరుగుతాయని...ఈ విషయంపై జాతీయ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల వైస్ ఛాన్సలర్లతో చర్చిస్తున్నట్లు జగదీష్ కుమార్ పేర్కొన్నారని నివేదిక పేర్కొంది. ఆ ప్రతిపాదనను అనేక విద్యా సంస్థలు స్వాగతించాయని, లా కోర్సులను భారతీయ భాషలలో ప్రారంభించడానికి సానుకూలతను వ్యక్తం చేశాయని జగదీష్ కుమార్ చెప్పినట్లు వెల్లడించింది.
భవిష్యత్తులో మరిన్ని కోర్సులను భారతీయ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జగదీష్ కుమార్ తెలియజేశారు. దీంతో ప్రాంతీయ భాషల వినియోగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ భాషపై విద్యార్థులు పట్టుసాధించడానికి శిక్షణ ఇవ్వడానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సువిశాల ప్రపంచంతో సంభాషించడానికి విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. దీంతో విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
కొత్త సబ్జెక్టులను మాతృభాషలో భోదించడం వల్ల విద్యార్థులు మరింతగా అర్థం చేసుకుంటారన్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని... భవిష్యత్తులో న్యాయశాస్ర్తానికి సంబంధించిన అవసరమైన పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని యూజీసీ చైర్ పర్సన్ జగదీష్ కుమార్ తెలిపారు.
కాగా, ఇప్పటికే వివిధ ఇంజనీరింగ్ కోర్సులను ప్రాంతీయ భాషలలో అందించడానికి కళాశాలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గతేడాది అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియంలోనే అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ కోర్సులను పలు స్థానిక భాషలతో పాటు తెలుగులోనూ చదవచ్చు. దీనికి సంబంధించి AICTE ఇప్పటికే 20 కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది.
ఇందుకు అనుగుణంగా ఆంద్రప్రదేశ్‌లోని ఓ కాలేజీ ఇప్పటికే తెలుగులో ఇంజినీరింగ్ కోర్సులను ప్రారంభించింది. కస్తూరి రంగన్ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు మీడియాం సంబంధించి ఏపీలోని ఎన్ఆర్ఐ కాలేజీకి అనుమతి వచ్చింది. తెలుగులో బీటెక్ కోర్సులను ఎన్ఆర్ఐ కాలేజీ ప్రారంభించింది. ఈ ఏడాది కంప్యూటర్ సైన్సు (సీఎస్ఈ) కోర్సును తెలుగులో ప్రారంభించినట్లు ఎన్ఆర్ఐ తెలిపింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.