Fixed Calendar : సాధారణంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్(Entrance exams)కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటారు. ముందు నుంచీ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నా.. ఎప్పుడు పరీక్ష ఉంటుందనే ఆందోళన ఉంటుంది. పోటీ పరీక్షలను క్రమబద్ధీకరించడానికి, చివరి నిమిషంలో గందరగోళాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్- మెయిన్(JEE Main), నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET), సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్(CUET) వంటి వాటికి వచ్చే ఏడాది నుంచి ఫిక్స్డ్ క్యాలెండర్(Fixed calender)ను రూపొందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్, మెడికల్, అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పరీక్షల షెడ్యూల్‌ను క్రమబద్ధీకరించడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ(Central education ministry ఈ వారంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
త్వరలో కొత్త నోటిఫికేషన్
యూజీసీ సోర్స్ ప్రకారం.. ఫిక్స్డ్ ఎగ్జామ్ క్యాలెండర్‌పై ఒక కమిటీ పనిచేస్తోంది. వివిధ పరీక్షలకు ఔత్సాహికులు మెరుగ్గా ప్రిపేర్ కావడానికి ప్రామాణిక క్యాలెండర్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షలు జనవరిలో జరగాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ నిలిపివేసి, కొత్తగా దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలను ఎన్టీఏ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది
జనవరి- ఏప్రిల్ మధ్య జేఈఈ
జేఈఈ (మెయిన్) పరీక్షలు జనవరి- ఏప్రిల్ మధ్యలో ఉంటాయి. సీయూఈటీ-యూజీ పరీక్షలు ఏప్రిల్ మూడవ వారం నుంచి మే మొదటి వారం మధ్య జరిగే అవకాశం ఉంది. నీట్-యూజీ పరీక్ష మే మొదటి ఆదివారంలో నిర్వహించవచ్చు. అయితే కచ్చితమైన తేదీలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ క్యాలెండర్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రాబబులిటీ సమయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. కరోనా కారణంగా 2020 నుంచి పోటీ పరీక్షల షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడింది.
జేఈఈ మెయిన్, నీట్-యూజీ ఔత్సాహికుల్లో కొంత మంది .. ఏప్రిల్- మేలో రెండు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను, జూన్‌లో మెడికల్ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది మళ్లీ కొత్త అకడమిక్ సెషన్ ఆగస్టుకు దారితీస్తుందని అధికారులు అంటున్నారు.
బ్యాక్-టు-బ్యాక్ పరీక్షలకు హాజరు
ఓ అధికారి మాట్లాడుతూ.. జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్ ఏప్రిల్‌లో నిర్వహిస్తే చాలా మంది అభ్యర్థులు మూడు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. పైగా ఎటువంటి గ్యాప్ లేకుండా బ్యాక్-టు-బ్యాక్ పరీక్షలకు హాజరుకావచ్చని వివరించారు. ఒక పరీక్షను రెండుసార్లు నిర్వహించాలనే ఆలోచనకు కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. వివిధ కారణాల వల్ల ఒక అభ్యర్థి ఒక పరీక్షకు హాజరు కాలేకపోతే, సన్నద్ధం కావడానికి కొంత సమయం లభిస్తుందని, అయితే బ్యాక్-టు-బ్యాక్ పరీక్షలు ఈ ప్రయోజనాన్ని అందించవని చెప్పుకొచ్చారు. JEE(మెయిన్)-జనవరి సెషన్ కోసం ఈ వారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా, ఇతర పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వరుసగా మార్చి, ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses