కేంద్ర ప్రభుత్వం స్కూళ్లను తిరిగి ప్రారంభించడానికి మార్గదర్శకాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ విద్యాశాఖ, ఐసీఎంఆర్ తో సంప్రదింపులు జరుపుతోంది. పాఠశాలలు తిరిగి ప్రారంభించే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే.. కొన్ని రాష్ట్రాలు తరగతులను ప్రారంభించడానికి ముందు మార్గదర్శకాల కోసం తమను సంప్రదిస్తున్నాయని ఆయా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గద్శకాలను రూపొందించడానికి కసరత్తు చేస్తోందని ఆ అధికారి వెల్లడించారు. ఆ మార్గదర్శకాలను త్వరలోనే రాష్ట్రాలకు తెలుపుతామని వివరించారు. ICMR డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మరియు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వంటి ప్రభుత్వ అధికారులు పాఠశాలలను ప్రాణాళికాబద్ధంగా తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాలకు సూచించారు.
చిన్న పిల్లలు తీవ్రమైన కోవిడ్ -19 వ్యాధికి గురయ్యే అవకాశం తక్కువగా ఉన్నందున, ప్రాథమిక పిల్లలను వ్యక్తిగత తరగతులకు హాజరయ్యేలా చేయడం ఉత్తమం అని భార్గవ వివరించారు. అయితే, పాఠశాలలు తెరవడానికి ముందు ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందికి టీకాలు వేయడం అవసరమని వారు తెలిపారు. ఇప్పటివరకు కొద్ది శాతం టీచర్లకు టీకాలు వేయబడినందున, CSR నిధుల కింద వారికి ఉచిత టీకాలు అందించడానికి కేంద్రం ప్రైవేట్ ఆసుపత్రుల సహాయం కోరింది. ఇప్పటి వరకు, పంజాబ్, గుజరాత్, బీహార్, ఒడిషా మరియు ఉత్తర ప్రదేశ్ మరియు మరికొన్ని పాఠశాలల్లో వ్యక్తిగత తరగతులకు ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి.
ఇదిలా ఉంటే.. ఎనిమిది రాష్ట్రాలలో ఆగస్టులో పాఠశాలలు తెరుచుకున్నాయి. దేశంలో మొట్టమొదటగా హర్యానాలో 9 నుండి 12 వ తరగతి వరకు తొలి ఫేస్ టూ ఫేస్ క్లాసులు ప్రారంభమయ్యాయి. జూలై 16 నుంచి వీటిని ప్రారంభించారు. తరువాత నాగాలాండ్ 11, 12 తరగతులకు జూలై 26 నుంచి అనుమతించింది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి.
ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలని ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది. అందుకు కావాల్సిన కోవిడ్ ప్రోటోకాల్ కు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 23 నుంచి కర్టాటకలో బడులు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీటిని విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.