కరోనా కారణంగా వాయిదా వేసిన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష జేఈఈ (మెయిన్) నిర్వహణపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రెండో దశ వైరస్ ఉద్ధృతి కారణంగా పది, పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఇప్పటికే బోర్డు పరీక్షలకు మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలు జారీ అవుతున్నాయి. దీంతో ప్రవేశ పరీక్షలను ఎలా నిర్వహించాలనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి వీటిని కచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల మాదిరిగా వాయిదా వేయడం కుదరదు. అందువల్ల ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించే పనిలో అధికారులు నిమగ్నమవుతున్నారు.
వివిధ విద్యా సంస్థలు, కళాశాలల్లో ప్రవేశానికి విపరీతంగా పోటీ ఉంటుంది. పరీక్షల్లో మంచి ప్రతిభ చాటిన విద్యార్థులకే ప్రవేశం లభిస్తుంది. అందువల్ల వీటిని బోర్డు పరీక్షల మాదిరిగా వాయిదా వేయడం కుదరదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రవేశ పరీక్షల ప్రాధాన్యం గురించి ప్రభుత్వానికి తెలుసని చెప్పారు. అయితే పరీక్షలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని పేర్కొన్నారు. పరీక్ష తేదీలపై నెలకొనే గందరగోళం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం, అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తున్నారని ఆయన వివరించారు.
నీట్, జేఈఈ పరీక్షలను కేంద్ర విద్యా శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికీ, గత ఏడాది జేఈఈ, నీట్ పరీక్షలు జరిగాయి. అందువల్ల ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షలు రద్దు కావడం అసాధ్యమని చెప్పుకోవచ్చు.
గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు 8.58 లక్షల మంది అభ్యర్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది నమోదు చేసుకున్నారు. పరీక్షల అనంతరం ఎప్పటిలాగే కోర్సుల్లో ప్రవేశాలు పూర్తయ్యాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)- 2021 ఏప్రిల్, మే సెషన్లు వాయిదా వేయగా, నీట్ యూజీ 2021 పరీక్ష ఆగస్టు 1న నిర్వహించాల్సి ఉంది. కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనేక రాష్ట్రాలు నీట్, జేఈఈ అభ్యర్థుల కోసం ఏర్పాట్లు చేశాయి. అందువల్ల ప్రవేశ పరీక్షల తేదీలను ఎన్టీఏ త్వరలోనే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.