ఆ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు, సిలబస్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

NEET-JEE Exams: ఈ సంవత్సరం కరోనా కారణంగా విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దీంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. సిలబస్‌ను కూడా తగ్గించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తాజాగా కీలక ప్రకటన చేశారు.

  • Share this:
జేఈఈ (JEE), నీట్ (NEET) వంటి పోటీ పరీక్షల్లో ఈ సంవత్సరం ఎక్కువ ఆప్షన్లతో ప్రశ్నలు ఉండేలా చూస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో జరిగిన ఆన్‌లైన్ వెబినార్ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే పోటీ పరీక్షల్లో మార్పులు ఉంటాయని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దీంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. సిలబస్‌ను కూడా తగ్గించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బోర్డు పరీక్షల్లో సవరించిన సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది బోర్డు పరీక్షల సిలబస్‌ను CBSE 30 శాతం తగ్గించింది. దీంతో కొత్తగా రూపొందించిన సిలబస్‌లోనే ప్రశ్నలు ఉంటాయని చెప్పారు.

పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత కూడా ఆన్‌లైన్ క్లాసులను కొనసాగిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. 50-50 శాతం డివిజన్‌తో... విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మిక్స్‌డ్ ఫార్మాట్లో బోధన అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్ధారించుకున్న తరువాతే పాఠశాలలను తెరుస్తామని వివరించారు.

పరీక్షలు రద్దు కావు..
దేశంలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల కోసం ఈ వెబినార్ నిర్వహించారు. ఈ సంవత్సరం విద్యా విధానానికి సంబంధించిన అనేక విషయాల గురించి విద్యార్థులు కేంద్ర మంత్రిని ప్రశ్నలు అడిగారు. వాటికి ఆయన సమాధానం ఇచ్చారు. కోవిడ్‌- 19 కారణంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడం, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ లేకపోవడం వల్ల చదవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో పరీక్షల గురించి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 10, 12 తరగతుల CBSE బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కొంతమంది కోరుతున్నారు. కానీ CBSE 10, 12 తరగతుల విద్యార్థులకు మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.
Published by:Nikhil Kumar S
First published: