విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) వివిధ సంస్కరణలను తీసుకొస్తోంది. విద్యార్థులకు నైపుణ్యానికి సంబంధించిన సబ్జెక్టులను ప్రవేశ పెట్టింది. సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ అవకాశాన్ని ఉచితంగా కల్పిస్తోంది. తాజాగా 11, 12వ తరగతులు చదివే వారి కోసం 43 స్కిల్ సబ్జెక్టులు తీసుకురాగా, 9, 10 విద్యార్థుల కోసం 22 స్కిల్ సబ్జెక్టులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు సంబంధించి ఉప-చట్టాల్లోని కొన్ని అంశాలను సవరించింది. జాతీయ విద్యా విధానం(National Educational Policy) 2020 మార్గదర్శకాలకు అనుగుణంగా సీబీఎస్‌ఈ ఈ స్కిల్ సబ్జెక్టు, స్కిల్ మాడ్యూల్‌లను విద్యార్థులకు అందిస్తోంది.
ప్రవేశ పెట్టిన కోర్సులు
ఈ స్కిల్ సబ్జెక్టులలో భాగంగా 9వ తరగతి విద్యార్థులకు వివిధ కోర్సులను కొత్తగా చేర్చింది. డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్, ఫౌండేషన్ స్కిల్స్ ఫర్ సైన్సెస్(ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ), ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్ తదితర సబ్జెక్టులున్నాయి. మరోవైపు 11వ తరగతి విద్యార్థుల కోసం డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్, ల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అసోసియేట్, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్ సబ్జెక్టులను ప్రవేశపెట్టింది.
మిడిల్ క్లాస్ విద్యార్థులకూ..
సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో చదివే 6, 7, 8వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘స్కిల్ మాడ్యూల్’ని ప్రవేశపెట్టింది. ఈ స్కిల్ మాడ్యూల్‌లో భాగంగా విద్యార్థులకు 12 నుంచి 15 గంటల నిడివితో కోర్సును అందించనున్నారు. ఈ మాడ్యూల్‌లో 70 శాతం సమయాన్ని విద్యార్థులతో వివిధ యాక్టివిటీస్ చేయించేందుకు వెచ్చించనున్నారు. మరో 30 శాతాన్ని థియరీకి కేటాయించనున్నారు.
ఒక ఆప్షనల్ సబ్జెక్టు
విద్యార్థులు ఏదైనా ఒక స్కిల్ సబ్జెక్టును లేదా ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఒక విద్యార్థి.. తప్పనసరిగా చదవాల్సిన సబ్జెక్టులైన సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్‌లతో పాటు ఆరో ఆప్షనల్ సబ్జెక్టుగా ఒక స్కిల్ సబ్జెక్టును ఎంచుకుంటే రెండు లాంగ్వేజ్‌లతో కలిపి మొత్తం 5 సబ్జెక్టుల మార్కులను విశ్లేషిస్తారు. అలాగే పర్సెంటేజ్‌కు సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్, స్కిల్ సబ్జెక్టులలో ఏదేని మూడింటిలో సాధించిన ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుని పర్సెంటేజ్‌ని లెక్కిస్తారు. అలాగే 6, 7, 8వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న స్కిల్ మాడ్యూల్‌ని పాఠశాల స్థాయిలోనే ఎవల్యూషన్ చేయనున్నారు. ఈ విషయాలను సీబీఎస్ఈ తాజా సర్కులర్‌లో పేర్కొంది.
విద్యార్థుల ఆసక్తి
దేశవ్యాప్తంగా 22 వేలకు పైగా ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో దాదాపు 27 లక్షల మంది విద్యార్థులు ఈ నైపుణ్య సబ్జెక్టులను అభ్యసించడానికి ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు వారు ఎన్రోల్ చేసుకున్నారు. ఈ స్కిల్ సబ్జెక్టులు, స్కిల్ మాడ్యూల్ గురించి మరింత తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌లో సీబీఎస్ఈ వివరాలను పొందుపర్చింది. వీటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్, ప్రశ్నాపత్రాలు వంటివాటిని ‘స్కిల్ ఎడ్యుకేషన్’ వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CBSE, JOBS