కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారింది. రాష్ట్రాలకు సంబంధించిన బోర్డులతో పాటు సీబీఎస్ఈ బోర్డులు సైతం కోవిడ్ కారణంగా పరీక్షలను రద్దు చేశాయి. విద్యార్థుల అంతర్గత ప్రతిభ, ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగా వారికి మార్కులు కేటాయించి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. త్వరలోనే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కూడా ప్రాతిపదికన విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఇదిలా ఉంటే 2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సీబీఎస్‌ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరాన్ని రెండు విభాగాలుగా విభజించినట్లు వెల్లడించింది.
ఈ మేరకు 50 శాతం సిలబస్ చొప్పున రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో తొలి విడత పరీక్షలు, వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో రెండో విడత బోర్డు పరీక్షలు జరుపనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. 10, 12వ తరగతులకు టెర్మ్‌ల వారీగా సిలబస్‌ను ఈ నెలాఖరున ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థుల అంతర్గత అంచనా, ప్రాజెక్ట్ వర్స్‌ను మరింత విశ్వసనీయంగా నిర్వహించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో బోర్డు పరీక్షలు నిర్వహించలేనందున ఈ ఏడాది రెండు విడతలుగా బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE Board Exams 2021