విద్యార్థులు(Students) పరీక్షలంటే ఒత్తిడికి గురవుతుంటారు. చదువుతో పాటు వారు మానసికంగా కూడా ధృఢంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకే సీబీఎస్ఈ బోర్డు 10, 12 తరగతుల విద్యార్థుల ఒత్తిడిని దూరం చేయడానికి 24X7 సైకలాజికల్ కౌన్సింగ్ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐవీఆర్ఎస్, టెలి కౌన్సిలింగ్(Tele Counseling), పాడ్‌క్యాస్ట్‌ల ద్వారా విద్యార్థులతో కమ్యూనికేట్ అవ్వడం, కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తున్నారు.
కొవిడ్ కారణంగా విద్యార్థులు పూర్తి స్థాయిలో పరీక్షలకు హాజరుకాలేదు. ఇప్పుడు మూడేళ్ల విరామం తర్వాత సీబీఎస్ఈ(CBSE) పరీక్షలు పూర్తి స్థాయిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్‌పై మానసిక ఒత్తిడి మరికాస్త ఎక్కువే ఉంటుంది. కాబట్టి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలలో సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో కౌన్సిలింగ్ సేవలు ప్రారంభమవుతాయని బోర్డు ప్రకటించింది.
* విద్యార్థులకు అందించే సేవలు ఇవే..
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్ఎస్) అనేది విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రారంభించిన ఉచిత సర్వీస్. సీబీఎస్ఈ బోర్డు టోల్ ఫ్రీ నంబర్ 1800-11-8004 ద్వారా 24 గంటలు సేవలు అందిస్తుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సేవలు అందుబాటులో ఉంటాయి. ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం అవ్వడం, సమయ నిర్వహణ, తరచుగా అడిగే ప్రశ్నలు, కొవిడ్ జాగ్రత్త చర్యలు, ఇతర వివరాలను దేశంలో ఎక్కడి నుంచైనా పొందొచ్చు.
విద్యార్థుల సౌకర్యం కోసం బోర్డు ఇప్పటికే వెబ్‌సైట్‌లో నమూనా ప్రశ్నలు, పరీక్ష విధానం, మార్కులకు సంబంధించిన వివరాలను ఉంచింది. వీటితో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా విద్యార్థులు వారి సందేహాలను తీర్చుకోవచ్చు.
సీబీఎస్ఈ ఐవీఆర్ఎస్ సేవల మాదిరిగానే స్వచ్ఛంద టెలి కౌన్సిలింగ్ సేవలను కూడా అందిస్తోంది. దీని కోసం 1800-11-8004కు కాల్ చేయాలి. ఈ కాంప్లిమెంటరీ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు అందుబాటులో ఉంటాయి. కౌన్సిలింగ్ సేవలు కల్పించడం కోసం ఈ ఏడాది భారత్, ఇతర దేశాల నుంచి 84 మంది ప్రిన్సిపాల్స్, కౌన్సిలర్స్ సహకరిస్తున్నారు. వీరిలో 73 మంది భారత్‌కు చెందిన వారు కాగా, మిగతా వారు ఇతర జపాన్, సింగపూర్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, ఒమన్ తదితర దేశాల నుంచి కూడా సేవలందిస్తున్నారు.
సీబీఎస్ఈ బోర్డుకు యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా కూడా విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్లాట్‌ఫాంల ద్వారా అనేక సందేశాత్మక వీడియోలను అందిస్తున్నట్లు బోర్డు తెలిపింది. యువత అనుభవాలు, ఇంటర్నెట్ వ్యసనం, నిరాశ, దూకుడు, మాదక ద్రవ్యాల వినియోగం, పరీక్షల ఒత్తిడి, మానసిక ఇబ్బందులు , జీవన నైపుణ్యాలు, ప్రత్యేకమైన అభ్యాస ఇబ్బందులు తదితర అంశాలపై ఆడియో, విజువల్ కంటెంట్‌ను సీబీఎస్ఈ బోర్డు అందించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CBSE, JOBS