ఈ సోషల్ మీడియా యుగంలో ఏ వార్త నిజం, ఏ వార్త అసత్యమో తెలియక అనేక మంది గందరగోళానికి గురవుతున్నారు. కరోనా ప్రారంభం నుంచి ఈ తప్పుడు వార్తల సంచారం అధికమైంది. ఫేక్ జీవోలు, దొంగ ప్రకటనలు వాట్సాప్, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల్లో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తప్పుడు వార్తలను తయారు చేసి, వాటిని సోషల్ మీడియాలో ఉంచుతూ రాక్షసానందం పొందే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఫేక్ న్యూస్ ఒకటి విద్యార్థులను గందరగోళానికి గురి చేసింది. కరోనా ప్రారంభంలో సీబీఎస్ఈ పలు పరీక్షలపై నిర్ణయాలు తీసుకుంది. కొందరు విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఇదంతా జరిగింది గత సంవత్సరం ఏప్రిల్ నెలలో. అయితే అప్పటి ప్రకటలకు సంబంధించిన కాపీలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఏడాది సీబీఎస్ఈ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయంటూ కొందరు వార్తలు సృష్టిస్తున్నారు.
అయితే ఈ అంశంపై సీబీఎస్ఈ బోర్డు స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని విద్యార్థులకు సూచించింది. పరీక్ష తేదీలు, నిర్వహించే విధానాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. పరీక్షలకు సంబంధించి అధికారిక ప్రకటనలు సీబీఎస్ఈ వెబ్ సైట్లో, అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్, సోషల్ మీడియా ఖాతాలను సందర్శించాని సూచించారు. ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దని వారు సూచించారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసిందంటూ ఓ ఫేక్ జీవో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అనేక మంది అది నిజమని నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ విషయం ప్రభుత్వం వరకు కూడా వెళ్లింది. దీంతో ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ అంశంపై స్పందించారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అవుతున్న ఆ జీవో ఫేక్ అని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి లాక్ డౌన్ విధించాలన్న ఆలోచన ఏమీ లేందంటూ ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనూ కొందరు వైన్స్ షాపులపై ఓ ఫేక్ జీవోను సృష్టించారు. రేపటి నుంచి వైన్స్ తెరవడానికి ప్రభుత్వం నిర్ణయించిందంటూ తప్పుడు సమాచారం ఉన్న ఆ జీవోను సోషల్ మీడియాలో ఉంచారు. అయితే అధికారులు ఆ తప్పుడు జీఓను సృష్టించిన వారిని గుర్తించి అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE Board Exams 2021, Corona, Exams, Fact Check