CBSE Class 12 Results: సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు? మార్కులు ఎలా కేటాయిస్తారు?

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థులకు మార్కుల లెక్కింపు కోసం సీబీఎస్​ఈ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఎట్టకేలకు ఆగస్టు 15 లోగా తుది ఫలితాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 17న సుప్రీంకోర్టుకు అందజేసిన విధివిధానాల ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

  • Share this:
కరోనా వైరస్ ప్రభావం వల్ల సీబీఎస్​ఈ పరీక్షలు రద్దు కావడంతో అనూహ్య పరిస్థితి నెలకొంది. ఫలితాలు ఎప్పుడొస్తాయి.. మార్కుల కేటాయింపు ఎలా ఉంటుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు విద్యార్థులకు మార్కుల లెక్కింపు కోసం సీబీఎస్​ఈ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఎట్టకేలకు ఆగస్టు 15 లోగా తుది ఫలితాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 17న సుప్రీంకోర్టుకు అందజేసిన విధివిధానాల ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సీబీఎస్​ఈ 12వ తరగతి విద్యార్థులకు గ్రేడ్​లు ఇస్తారన్న వార్తలను బోర్డు అధికారి ఒకరు ఖండించారు. విద్యార్థులందరికీ మార్కులే కేటాయిస్తామని స్పష్టం చేశారు. ముందటి బ్యాచ్ విద్యార్థుల్లాగే వీరికి మార్కుల పద్ధతే ఉంటుందని చెప్పారు. ఇక విద్యార్థుల మార్కుల గణనకు ప్యానెల్ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది.

వేర్వేరు ఇంటర్నల్ పరీక్షల్లో 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల ప్రదర్శన ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. ఇందుకు 12 మంది సభ్యులతో సీబీఎస్​ఈ ఓ ప్యానెల్​ను ఈ నెల 4న నియమించింది. ఈ మార్కుల లెక్కింపు ప్రక్రియలో పాఠశాలలు, టీచర్లు కూడా ప్రధాన పాత్ర పోషించనున్నారు.

పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల పూర్తి వివరాలను సమర్పించేందుకు సీబీఎస్​ఈ ఓ నెల సమయం ఇచ్చింది. స్కూళ్లు వివరాలు పంపిన 10 నుంచి 15 రోజుల్లో ఫలితాలు ప్రకటించాలని సీబీఎస్​ఈ భావిస్తోంది. దీంతో ఆగస్టు 15 లోగా ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు కచ్చితంగా చెబుతున్నారు.

మార్కుల కేటాయింపునకు ప్రామాణికంగా తీసుకునే ముఖ్యమైన అంశాలు:
విద్యార్థులకు గ్రేడ్​లు కాకుండా ఎప్పుడూ ఇచ్చేలా మార్కులే కేటాయించాలని సీబీఎస్​ఈ నిర్ణయించింది. ఒకవేళ భవిష్యత్తులో విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల మార్క్​షీట్లపై ప్రత్యేకంగా ఈ విషయాన్ని పొందుపరచనుంది. ఈసారి విద్యార్థులకు మార్కుల కేటాయింపులో పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల్లోని ప్రదర్శన కీలకంగా మారింది. ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలతో పాటు పాఠశాలల్లో జరిగిన ఇంటర్నల్ అసెస్​మెంట్​లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సీబీఎస్​ఈ మార్కులు కేటాయించనుంది.

ప్రీ-బోర్డు పరీక్షలు, ఇంటర్నల్​ అసెస్​మెంట్​లో సరిగా మార్కులు తెచ్చుకోని విద్యార్థుల కోసం కరోనా పరిస్థితులు చక్కబడ్డాక సీబీఎస్​ఈ మళ్లీ పరీక్షలు నిర్వహించనుంది. సబ్జెక్టుల వారిగా ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే తుది మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు కూడా సబ్జెక్టుల పరంగా మళ్లీ పరీక్షలు రాయవచ్చు. మొత్తం 14వేలకు పైగా పాఠశాలలు ఈ మార్కుల లెక్కింపులో భాగంగా ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published: