హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Board Exams 2021: ఈ ఏడాది బోర్డు పరీక్షలు రద్దు అవుతాయా? ఆయా బోర్డులు ఏమన్నాయంటే..

Board Exams 2021: ఈ ఏడాది బోర్డు పరీక్షలు రద్దు అవుతాయా? ఆయా బోర్డులు ఏమన్నాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఆయా బోర్డు పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ విద్యార్థుల నుంచి విపరీతంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ బోర్డులు ఈ అంశంపై స్పందించాయి. అవి ఏమన్నాయంటే..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షలను అధికారులు వాయిదా వేస్తున్నారు. మరెన్నో పరీక్షలు రద్దు అవుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో 10, 12 తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ విద్యార్థుల నుంచి వస్తోంది. ఇప్పటికే ఈ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లక్ష మందికి పైగా విద్యార్థులు పిటిషన్ పై సంతకం చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న ఈ సమయంలో పరీక్షలను రద్దు చేయాలని లేదా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా "cancelboardexams2021" హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. అయితే విద్యార్థుల నుంచి వస్తున్న ఈ డిమాండ్ పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(CISCE) స్పందించాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలను పాటిస్తామని ఆయా బోర్డులు తెలిపాయి.  పరీక్ష కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు వీలుగా ఇప్పటికే 40 నుంచి 50 శాతం పరీక్షా కేంద్రాలను పెంచామని వెల్లడించాయి.

అయితే దేశంలో అతి తక్కువ కరోనా కేసులు ఉన్న సమయంలో పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వాలు, అధికారులు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో పరీక్షలను నిర్వహించడం ఏంటన్న ప్రశ్నలు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అయితే సీబీఎస్ఈ బోర్డు గత వారంలో కీలక ప్రకటన చేసింది. ఎవరైనా విద్యార్థులు కరోనా కారణంగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకపోతే వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. విద్యార్థుల కుటుంబంలో ఎవరైనా కరోనాకు గురైనా వారు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షలకు హాజరు కావొచ్చని బోర్డు తెలిపింది. అయితే ఇదే నిబంధనలు రానున్న బోర్డు రాత పరీక్షలకు కూడా వర్తిస్తాయా? లేదా అన్న విషయంపై ఇంత వరకు స్పందన రాలేదు.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలను మూసి వేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను సైతం సర్కారు వాయిదా వేసింది. దీంతో బోర్డు పరీక్షలు సైతం అనుకున్న సమయానికి జరుగుతాయా? జరగవా? అన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల్లో నిర్వహించే ప్రవేశ పరీక్ష ను సైతం అధికారులు వాయిదా వేశారు. వివిధ ప్రవేశ పరీక్షలకు అప్లై చేసేందుకు అఖరి తేదీని సైతం అధికారులు పొడిగిస్తున్నారు.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021, Exams

ఉత్తమ కథలు