సీబీఎస్ఈ మొదటి నుంచి పిల్లలకు ప్రయోగాత్మక విద్యను అందించేందుకు కృషి చేస్తుంది. పుస్తకాల్లోని పాఠాలను చదవడం కన్నా, పిల్లల్లో విషయ పరిజ్ఞానం పెంచేందుకు పెద్దపీట వేస్తుంది. దానికి అనుగుణంగానే అన్ని తరగతులకు బోధన ప్రణాళిక అమలవుతుంది. ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 2023-24 అకడమిక్ సెషన్ కోసం కొత్త కరికులంను తయారుచేసింది. దీన్ని ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం సిద్ధం చేశారు. ఇలా రూపొందించిన నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్(NCFFS)ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆమోదించింది.
కొత్తగా రూపొందించిన ఈ ఐదేళ్ల ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కరికులంను నర్సరీ నుంచి 2వ తరగతి వరకు అమలుచేస్తారు. సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ఇందులో భాగంగా మూడేళ్ల నుంచి ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలకు పాఠాలు బోధిస్తారు.
బోర్డు అనుమతులు
ఇప్పటికే కొన్ని పాఠశాలలు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నాయి. వారు యథావిధిగా ఈ విధానాన్ని కొనసాగించవచ్చు. అవి లేకుండా నడుస్తున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ జత చేసేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇందుకోసం సీబీఎస్ఈ బోర్డు అనుమతులు ఇచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 విధానాలకు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ దీన్ని తయారుచేసింది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
సులువైన బోధన
కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్‌లో పిల్లలకు సులువుగా బోధించవచ్చని, అందుకోసమే దీన్ని రూపొందించినట్లు బోర్డు తెలిపింది. బోధన సామర్థ్యం, అభ్యసన, మెరుగైన అభ్యసన ఫలితాలు అందించడమే లక్ష్యంగా NCFFS పనిచేస్తుందని, ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసినట్లు బోర్డు ప్రకటనలో పేర్కొంది. పాఠ్యాంశాల బోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా ఉంటుందని వివరించింది.
ఈ కొత్త విధానంలో పిల్లలకు అనేక విధాలుగా బోధన చేయవచ్చు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఉదాహరణలు, వివరణలతో పాఠాలు చెప్తే సులభంగా గుర్తుంటుంది. ఇలా వారు విషయాన్ని త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక అంశంపై పూర్తి అవగాహన పెంచేలా చెప్పడం ద్వారా వాళ్లల్లో కొత్త ఆలోచనలు కలిగించేలా చేయొచ్చని అని బోర్డు భావిస్తోంది. ప్రస్తుత కాలంలో రోజువారీ బోధనలో సందర్భానుసారంగా వీటిని పిల్లలకు చెప్పడం అవసరమని, అందుకు తగినట్లుగానే NCERT కొత్త కరికులంను సిద్ధం చేసినట్లు CBSE నోటీసులో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Schools