సీబీఎస్ఈ 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతుల టర్మ్-1 పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్మ్-1 పరీక్ష ఫలితాలు ఎప్పుడు వెలువడతాయా అని విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం, సీబీఎస్ఈ టర్మ్-1 పరీక్షా ఫలితాలు వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 10, 12వ తరగతుల టర్మ్-1 బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.inలో రిలీజ్ అవుతాయి. అంతేకాదు సంబంధిత పాఠశాలల్లోనూ ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు డిసెంబర్ 11న ముగియగా.. 12వ తరగతి పరీక్షలు డిసెంబర్ 21న పూర్తయ్యాయి.
సీబీఎస్ఈ బోర్డు ఈసారి పరీక్షలను రెండు టర్మ్‌లుగా విభజించింది. మొదటి టర్మ్‌ని అత్యంత ముఖ్యమైన పరీక్షగా పరిగణించింది. ఒకవేళ టర్మ్-2 పరీక్షలు రద్దయితే ఫైనల్ రిజల్ట్‌ను టర్మ్-1 మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్స్, ప్రాక్టికల్‌ల ఆధారంగా నిర్ణయిస్తారు. టర్మ్-1లో ఏ విద్యార్థిని ఫెయిల్ లేదా పాస్ అని గుర్తించమని.. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మెరిట్ జాబితాను విడుదల చేస్తామని బోర్డు ఇప్పటికే పేర్కొంది. ఒక విద్యార్థి ఏదైనా ఒక పేపర్‌కు హాజరు కానట్లయితే.. ఆ విద్యార్థి గైర్హాజరు అయినట్లు మార్క్ చేస్తామని బోర్డు వివరించింది. ఫైనల్ రిజల్ట్‌ను పాఠశాల సబ్‌మిట్ చేసిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
మొదటి టర్మ్ తర్వాత విద్యార్థులు తమను తాము మెరుగ్గా విశ్లేషించుకోగలుగుతారు. తద్వారా రెండవ టర్మ్‌కు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల ఈ సంవత్సరం బోర్డు పరీక్షలలో ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుందని సీబీఎస్‌ఈ పరీక్షా నియంత్రణాధికారి (controller) సన్యాం భరద్వాజ్ తెలిపారు.
ఈ క్రమంలోనే చాలా స్కూళ్లు పరీక్షకు ముందుగానే టర్మ్-1 క్వశ్చన్ పేపర్లను విద్యార్థులకు అందజేశాయని సీబీఎస్‌ఈ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (CSMA) ఆరోపించింది. చాలా మంది టీచర్లు స్టూడెంట్లకు సమాధానాలు కూడా చెప్పి సహాయం చేశారని సీఎస్ఎంఏ ఆరోపించింది. సీబీఎస్‌ఈకి రాసిన లేఖలో పేపర్ లీక్‌లు, లొసుగులు, మాల్ ప్రాక్టీస్ ల గురించి అసోసియేషన్ పేర్కొంది.
ఉపాధ్యాయులు విద్యార్థులకు లోకల్ ఏరియా నెట్‌వర్క్, వాట్సాప్ ల ద్వారా ఆన్సర్ కీలను, లీక్ అయిన ప్రశ్నలను అందిస్తున్నారని కూడా పేర్కొంది. టర్మ్ 1 పరీక్షను రద్దు చేయమని సీబీఎస్‌ఈ బోర్డుని కూడా కోరింది. అదే రోజున ఆన్సర్ కీలను మూల్యాంకనం చేయమని బోర్డ్ అంతకుముందు పాఠశాలలను కోరింది. అయితే మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. వాటిని అప్‌లోడ్ చేసి బోర్డుకి పంపమని పాఠశాలలను కోరింది. ఓఎంఆర్ షీట్లలో ఎలాంటి ఎర్రర్స్ లేవని పలువురు ఉపాధ్యాయులు చెప్పడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.