వాడికేం రా.. కాలు మీద కాలేసుకుని కూర్చుని మరీ సంపాదిస్తున్నాడు అని కొంతమందిని ఉద్దేశించి అంటుంటారు. వాళ్ల ఆఫీసులో పనేం ఉండదు, ఉత్తి పుణ్యానికే లక్షలకు లక్షలు జీతం ఇస్తున్నారు.. అని మరికొందరి గురించి మాట్లాడుకునే మాటలివి. ఆఫీసుకు వెళ్లి సంతకాలు పెట్టి వస్తే చాలు, వాళ్లకు జీతం అకౌంట్లో పడిపోతోంది.. అని ఇంకొంతమంది గురించి చెప్పుకునే కబుర్లు. మరి అలాంటి ఉద్యోగాలకు ఎంతో కష్టపడితేనే కానీ సెలెక్ట్ అవ్వరు. ఆ స్థాయికి అంత ఈజీగా చేరుకోరు. అచ్చం అలాంటి ఉద్యోగమే కుర్రాళ్లను ఊరిస్తోంది. రారమ్మని పిలుస్తోంది. ఆఫీసుకు వచ్చి, కాలుమీద కాలేసుకుని కూర్చుని నాలుగు రకాల ఐటమ్స్ ను రుచి చూడటమే పని. నెల తిరిగేసరికి లక్షల్లో జీతం మీ ఖాతాలో ఉంటుంది. అదేం జాబ్ అనుకుంటున్నారా.?
క్యాండీ ఫన్ హౌస్ ( Candy Funhouse) అనే ఓ కంపెనీ ఉంది. మిస్సిస్సగా, ఓంటారియో, హోవెవర్, వంటి నగరాల్లో ఈ కెనడియన్ కంపెనీకి ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. క్యాండీలను తయారు చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తుంటుంది. మరి ఆ క్యాండీలు టేస్టీగా ఉండి వినియోగదారులను ఆకట్టుకుంటేనే కదా నాలుగు రాళ్లను వాళ్లు సంపాదించుకునేది. మరి అవి టేస్టీగా ఉన్నాయో లేదో తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ ఉద్యోగ వ్యవస్థనే రూపొందించింది. ’క్యాండియాలజిస్ట్స్‘ అని ఆ ఉద్యోగులను పిలుస్తుంటారు. తాజాగా ఆ ఉద్యోగుల కోసం క్యాండీ ఫన్ హౌస్ ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. క్యాండీలు, చాకొలెట్స్ అంటే ఇష్టం ఉండేవాళ్లు ఆ ఉద్యోగానికి అర్హులు. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అయినా ఈ ఉద్యోగాన్ని చేయొచ్చు. ఆ కంపెనీ తయారు చేసే దాదాపు 3000 రకాల క్యాండీలను టేస్ట్ చేసి, ఎలా ఉన్నాయో చెప్పడమే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారి పని.
పని బాగానే ఉంది. హాయిగా కూర్చుని తినడమే కదా. జీతం తక్కువ ఇస్తారేమోనని అపోహలు ఏమీ వద్దండోయ్. ఈ ఉద్యోగానికి ఎంపిక కావాలంటే కనీసం 18 ఏళ్ల వయసు ఉండి తీరాలి. గంటకు 60 కెనడియన్ డాలర్ల (దాదాపు 3400 రూపాయలు) జీతంగా ఇస్తారన్నమాట. అంటే సగటున రోజుకు ఏడు గంటల పాటు పనిచేసినా రోజుకు రూ.20వేల పైనే జీతం వస్తుందన్నమాట. అంటే నెలకు దాదాపు ఆరు లక్షల రూపాయలను సంపాదించొచ్చన్నమాట. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కూడా ఉందంట. ఇదేదో బాగుందనుకుంటున్నారా..? మరి ఆలస్యం దేనికి వెంటనే ఆ సంస్థ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసేయండి. ఫిబ్రవరి 15వ తారీఖే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ.
Published by:Hasaan Kandula
First published:January 24, 2021, 12:01 IST