కొన్ని రోజుల్లోనే 2023వ సంవత్సరం మొదలు కాబోతోంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మరింత దగ్గరవుతుంది. కొన్ని నెలల్లోనే టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు తీరికలేని ప్రణాళికతో ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. పరీక్షల తేదీ దగ్గర పడే కొద్ది విద్యార్థుల్లో సాధారణంగానే టెన్షన్ పెరుగుతుంది. ఎంత బాగా పరీక్షలకు సిద్ధమైనా తెలియని ఒత్తిడి ఆవహిస్తుంది. కొందరికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ అడ్డంకులను అధిగమిస్తే ఉత్తమ ఫలితాలు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడితో సతమతమయ్యే విద్యార్థులకు తప్పక చేయాల్సిన, చేయకూడని విషయాలను వివరించారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్థిరమైన లక్ష్యం ఉండాలి
పరీక్షల ఒత్తిడిని తట్టుకునేందుకు మొదటగా కావాల్సింది స్థిరమైన లక్ష్యం. ఎంతసేపు చదువుతున్నాం అనే దానిపై కాకుండా.. ఎంతవరకు గుర్తుంది అనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు.. అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకుని వాటిని సాధించినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామర్థ్యాన్ని గుర్తించి.. తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్నది సాధించవచ్చు.
తగిన నిద్ర, భోజనం, వ్యాయామం
చాలా మంది పరీక్షల ముందు రాత్రంతా మేలుకుని చదువుతారు. సరిగ్గా తిండి మీద దృష్టి ఉండదు. గంటల తరబడి ఒకే చోట కూర్చుని చదువుతుంటారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో తెలియని కంగారు ఏర్పడుతుంది. పరీక్షల సమయంలో శరీరం, మెదడు పనితీరు బాగుండాలంటే.. కనీసం 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. కెఫైన్ ఉండే ప్రొడక్టులకు దూరంగా ఉండాలి. కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి వాటి ద్వారా పరీక్షల సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది.
భయాందోళన అధిగమించాలి
స్యూలు నుంచి కళాశాల స్థాయి విద్యార్థుల వరకు పరీక్షల సమయంలో భయాందోళనకు గురికావడం సర్వసాధారణం. ఏ సమయంలో అయినా ఇటువంటి పరిస్థితికి లోనైతే.. విద్యార్థులు గట్టిగా ఊపిరి పీల్చుకుని, తగినంత నీరు తాగాలి. ఆందోళనను సులువుగా జయించగలమనే నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలుసుకోవాలి.
ప్రాణాయామం వంటివి చేయాలి
ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు మనసుకు ప్రశాంతత అందించే శ్వాసకు సంబంధించిన ప్రాణాయామం వంటివి చేయాలి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి, చదువు మీదకు దృష్టి మళ్లుతుంది. క్రమంగా ఆందోళన దూరం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అనవసర విషయాల గురించి ఆలోచనలు రాకుండా కట్టడి చేస్తుంది.
నమ్మకం పెంచుకోవాలి
నిరంతరం సవాలను ఎదుర్కొంటున్నప్పుడు ఎంత దూరం వచ్చాం, ఏం సాధించాం అనే విషయాలను పరిశీలించం. పరీక్షలకు బాగా సిద్ధమైనప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పాజిటివ్ విషయాలతో భర్తీ చేయాలి. నేను ఇది చెయ్యలేను అని ఆలోచించే కన్నా, నేను ఇది చేయగలను, దీన్ని నేను సాధిస్తాను అనుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులకు తమను తాము నమ్మాలి. పరీక్షల సమయంలో అలసట, ఒత్తిడి సర్వసాధారణమైనప్పటికీ వాటిని జయించడం పెద్ద కష్టమేమి కాదు. ఒత్తిడికి లోనైన సమయంలో ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది. తల్లిదండ్రులు, స్నేహితులతో మాట్లాడాలి, వారికి పరిస్థితి వివరించాలి. ఇది ఒత్తిడి భారాన్ని తగ్గిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CBSE, Exam Tips, JOBS