Government Schools: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న అధికారుల పిల్లలు ఎందరో చెప్పండి.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లలో చదివిస్తున్నారో తెలియజేయాలని బీహార్​ విద్యా శాఖను పాట్నా హైకోర్టు ఆదేశించింది.

  • Share this:
అధికారులు, ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చదివించాలని, అలా అయితేనే వాటిలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని పాట్నా హైకోర్టు గతంలో అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో ఇప్పుడు ఎంతమంది ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లలో చదివిస్తున్నారో తెలియజేయాలని బీహార్​ విద్యా శాఖను పాట్నా హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న రాష్ట్ర-కేడర్ పరిధిలోని ఐఏఎస్, ఐపిఎస్, క్లాస్ -1, II సర్వీసుల్లోని అధికారుల పిల్లల డేటా సేకరిస్తున్నారు విద్యా శాఖ అధికారులు. ఇప్పటికే బీహార్​ అంతటా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాల్లలో పనిచేసే గెస్ట్ ఫ్యాకల్టీని విధుల నుంచి తొలగించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్​పై విచారణ చేపట్టిన జస్టిస్ అనిల్ ఉపాధ్యాయ నేతృత్వంలోని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ప్రభుత్వ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుంటే విద్యాభోధన ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు పేద, మధ్య తరగతి పిల్లలకు విద్యను దూరం చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే తప్ప రాష్ట్ర విద్యావ్యవస్థలో మార్పు రాదని వ్యాఖ్యానించింది. అసలు, ఎంతమంది ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చదివిస్తున్నారో సమగ్ర వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

హైకోర్టు ఆదేశాల మేరకు విద్యా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్.. బీహార్‌లోని మొత్తం 38 జిల్లాల జిల్లా న్యాయాధికారులకు, పోలీసు సూపరింటెండెంట్లకు లేఖ రాశారు. డేటా సేకరణలో సహకరించాలని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను ఆయన కోరారు. సమగ్ర వివరాలను ఆగస్టు 4లోపు సమర్పించాలని ఆదేశించారు. కాగా, ఈ డేటాబేస్ వివరాలను కోర్టుకు సమర్పించే ముందు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ త్రిపురారీ శరణ్ సమీక్షించనున్నారు.

అలా అయితేనే మెరుగైన విద్యా బోధన..
అధికారిక గణాంకాల ప్రకారం, బీహార్​ రాష్ట్రంలో 209 మంది ఐఏఎస్ అధికారులు, 219 మంది ఐపిఎస్ అధికారులు పనిచేస్తున్నారు. వీరితో పాటు వేలాది క్లాస్-1, II కేడర్ అధికారులు పని చేస్తున్నారు. బీహార్‌లో మొత్తం 72,663 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వాటిలో 42,573 ప్రాథమిక, 25,587 ఉన్నత పాఠశాలు, 2,286 మాధ్యమిక పాఠశాలలు, 2,217 సీనియర్ మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published: