జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ(JEE) మెయిన్-2022లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది అస్సాంకు చెందిన స్నేహ పరీఖ్. 300/300 మార్కులతో 100 పర్సంటైల్ స్కోర్ సాధించింది. జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన ఏకైక మహిళా అభ్యర్థి(Candidate)ఈమె కావడంతో, సెషన్ 2 పరీక్షలకు హాజరు కాలేదు. ఇప్పుడు ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అవుతోంది ఈ ఫస్ట్ ర్యాంకర్(Ranker). అమ్మాయిలు తమను తాము విశ్వసిస్తే ఏ స్ట్రీమ్‌లోనైనా రాణించగలరని.. తాను కూడా ఇదే పాటించానని చెబుతోంది స్నేహ. జేఈఈ మెయిన్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన 24 మంది అభ్యర్థుల్లో ఇద్దరు మాత్రమే అమ్మాయిలు ఉండటం విశేషం.
ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో తక్కువ మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించడంపై స్నేహ పరీఖ్ స్పందించింది. ‘కోచింగ్ క్లాస్‌లలో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. జేఈఈ, స్టెమ్ (STEM) కోసం కోచింగ్ తీసుకునే అమ్మాయిల సంఖ్య అబ్బాయిల మాదిరిగానే ఉంటే, ప్రవేశ పరీక్షల్లో ఎక్కువ మంది అమ్మాయిలు ర్యాంకులు సాధించే అవకాశం ఉంది’ అని అభిప్రాయపడింది. ఒక అమ్మాయికి ఒక విషయంపై అభిరుచి ఉంటే, దాన్ని అనుసరిస్తూ విజయం సాధించాలని ఆమె సూచించింది.
‘నా చిన్నతనంలో గూగుల్ (Google)వచ్చింది. ఇది కంప్యూటర్‌లపై ఆసక్తిని రేకెత్తించింది. అప్పటి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెరిగింది. ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను.’ అని ఆమె చెప్పుకొచ్చింది.
స్నేహ ఫరీఖ్ కుటుంబంతో గౌహతిలో నివసిస్తోంది. ఆమె స్వస్థలం రాజస్థాన్. తనకు ఇష్టమైన సబ్జెక్టు గణితం. జేఈఈ కోసం ఆమె గౌహతిలోని అలెన్ కోచింగ్ సెంటర్‌లో చదువుకుంది. తన ప్రిపరేషన్ గురించి ఇలా స్పందించింది. ‘ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు చదవడం ప్రారంభిస్తా. ముందు రోజు పాఠాలను పూర్తిచేసిన తరువాతనే సాధారణ తరగతులకు హాజరు అయ్యేదాన్ని. సెల్ప్ స్టడీపై ఎక్కువ దృష్టిసారించాను. అసైన్‌మెంట్స్ పూర్తి చేయడానికి, కొత్త కాన్సెప్ట్‌లను లోతుగా స్టడీ చేయడానికి కోచింగ్ సెంటర్‌లోనే ఉండేదాన్ని. ఉపాధ్యాయులు అందించిన NCERT పుస్తకాలు, నోట్స్‌పైనే ఆధారపడి ప్రిపరేషన్ అయ్యాను.’ అని స్నేహ వివరించింది.
ఫిజిక్స్ కఠినమైన సబ్జెక్టు కావడంతో దానికి ఎక్కువ సమయం కేటాయించినట్లు స్నేహ తెలిపింది. టాపిక్ అండ్ సబ్జెక్ట్ వారీగా, పుల్ టైమ్ ఎగ్జామ్‌తో చాలా మాక్ టెస్ట్‌లను ప్రాక్టిస్ చేసింది. పరీక్ష సన్నద్ధత సమయంలో ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమని ఆమె పేర్కొంది. ప్రిపరేషన్ సమయంలో తరచూ విరామం తీసుకోవడం అవసరమని ఆమె సూచించింది. ఇది రిఫ్రెష్ కావడానికి దోహదపడుతుందని పేర్కొంది. ఈ జేఈఈ టాపర్ KVPY స్కాలర్‌షిప్‌ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతోంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IIT, Jee mains 2022, JOBS, Rajasthan