చాలామందికి ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకుని, జీవితంలో బాగా స్థిరపడాలని కోరికగా ఉంటుంది. అయితే కొందరు యూనివర్సిటీ లేదా కాలేజీని సెలక్ట్ చేసుకునేటపుడు ఏది మంచిదో తెలియక తికమకపడతారు. ఎవరినైనా అడిగినా ఎవరికి తోచింది వాళ్లు చెప్పడంతో మరింత కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి వారికి క్వాక్వారెల్లి సైమండ్స్(QS) ప్రకటించిన ప్రపంచంలోనే అత్యుత్తమ యునివర్సిటీలు(Universities) ఉపయోగపడతాయి. ఏటా ఈ సంస్థ వరల్డ్‌లో టాప్ యూనివర్సిటీలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది కూడా వివిధ దేశాల్లోని టాప్‌క్లాస్ విద్యాసంస్థలను పరిశీలించి ర్యాంకులు ప్రకటించింది.
పరిశీలించే అంశాలు ఏమిటంటే..
QS వరల్డ్ యూనివర్సిటీలు ప్రకటించేందుకు ఆరు అంశాలను పరిశీలిస్తుంది. యాజమాన్య ప్రతిష్ట, సంస్థ ప్రతిష్ట, సంస్థాగత పరిశోధన, బోధనా సిబ్బంది, విద్యార్థుల నిష్పత్తి, అంతర్జాతీయ స్థాయి బోధనా సిబ్బంది, నిపుణులు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 1,500 సంస్థలకు ర్యాంకులు ఇవ్వగా అందులో టాప్ 100లో భారత్ నుంచి ఒక్కటి కూడా లేదు. ఐఐటీ బాంబే 177, ఐఐటీ ఢిల్లీ 193వ స్థానంలో నిలిచింది.
టాప్ 10 విద్యాసంస్థలు ఇవే..
QS వరల్డ్ ప్రకటించిన టాప్ వర్సిటీల లిస్ట్‌లో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) అగ్రస్థానంలో నిలిచింది. సర్వేలో 100కి 100 స్కోర్ చేయడం ద్వారా మొదటిస్థానంలో నిలిచి, వరుసగా పదోసారి ఈ ఘనత సాధించింది. అమెరికాలో చదువుకోవాలని అనుకునేవారికి MIT చాలామంచి ఎంపిక. రెండోస్థానంలో యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిలిచింది. 1209లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటి. ప్రపంచంలో ఎంతోమంది మేధావులు ఇక్కడ చదువుకున్నారు. మూడోస్థానంలో యూఎస్‌లోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో 1885లో దీన్ని ప్రారంభించారు. ఇక్కడ అత్యుత్తమ బోధన ఉండగా, విద్యార్థుల పరిశోధనకు పెద్దపీట వేస్తారు.
ఇక నాలుగో స్థానంలో యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిలిచింది. 1096లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ ప్రపంచంలోని అతి పురాతన విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది. వీళ్లు రూపొందించిన ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీని ప్రపంచమంతా ఇప్పటికీ వినియోగిస్తుంది. అనేక అంశాలపై పరిశోధనలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అనేక రంగాలకు చెందిన మేధావులు ఇక్కడకు వస్తుంటారు. అయిదో స్థానంలో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిలిచింది. 1636లో స్థాపించిన ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ.
ఆరోస్థానంలో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. 1891లో కాలిఫోర్నియాలో దీన్ని స్థాపించారు. సైన్స్, ఇంజినీరింగ్ చేసేవాళ్లకు చాలామంచి ఎంపిక. ఏడోస్థానంలో యూకేలోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ నిలిచింది. ఎనిమిదో స్థానంలో యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (UCL) ఉంది. తొమ్మిదో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యాసంస్థ ETH Zurich నిలవగా, పదో స్థానంలో యూఎస్‌ఏలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఉంది.
మనదేశంలో..
ఇండియా నుంచి ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ టాప్ 200లో స్థానం దక్కించుకోగా సంస్థాగత పరిశోధన విభాగంలో బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) ప్రథమ స్థానంలో నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, University