ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. జనవరి 8వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను (APPSC Group-1 Prelims) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్ష పేపర్-1 ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని తెలిపింది. పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లలో ఈ ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 31వ తేదీ అంటే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (https://psc.ap.gov.in/) నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకుని వాటిపై ఉన్న నిబంధనలను, మార్గదర్శకాలను చూసుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఇంకా సెంటర్ చిరునామాను కూడా ముందుగానే తెలుసుకోవడం ద్వారా పరీక్ష రోజు సెంటర్ కు త్వరగా చేరుకోవచ్చని సూచించింది.
రెండు పేపర్లు.. 240 మార్కులు..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 240 మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 120 మార్కులు. మొదటి పేపర్లో జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్ లో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Andhra Pradesh Public Service Commission) ఇటీవల గ్రూప్-1 నోటిఫికేషన్ 92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభం కాగా... దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 2గా పేర్కొన్నారు. అయితే.. దరఖాస్తు గడువును నవంబర్ 5 వరకు పొడిగించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. జనవరి 8కి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. ఈ మేరకు తాజాగా హాల్ టికెట్ల విడుదలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, APPSC, Job notification, JOBS