ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) ఇటీవల వర్చువల్ స్కూల్ (Virtual School)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ వేదికగా ఇది పనిచేయనుంది. ఢిల్లీ రాజధాని ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు (Students) కూడా ఇందులో చేరవచ్చు. ఆన్‌లైన్ క్లాసుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. విద్యార్థుల పాఠశాల నమోదు నిష్పత్తిని పెంచడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ముఖ్యంగా పాఠశాలలు అందుబాటులో లేని విద్యార్థుల కోసం ఈ ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్(DMVS)ను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓ ప్రకటన చేశారు. ‘ప్రతి విద్యార్థి పాఠశాలలకు వెళ్లాలని నేను భావిస్తున్నాను. అయితే విద్య అందుబాటులో లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి కోసం వర్చువల్ స్కూల్ ద్వారా విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ స్కూల్ ఆన్‌లైన్ తరగతులను ఆఫర్ చేస్తుంది. ఇందులో వర్చువల్ లెక్చర్స్, రికార్డ్ అండ్ లైవ్ లెక్చర్స్, స్కిల్-బేస్డ్ కోర్సులు ఉంటాయి. అలాగే జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ ఇస్తారు. ప్రారంభ దశలో ఈ వర్చువల్ స్కూల్ 9 - 12 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంది. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (DBSE)తో అనుబంధంగా ఈ వర్చువల్ స్కూల్ పనిచేయనుంది.
ఈ స్కూల్ మొదటి బ్యాచ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.dmvs.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన స్కూల్ నుంచి కనీసం 8వ తరగతి వరకు చదివి, 13-18 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు ఈ వర్చువల్ స్కూల్‌లో 9వ తరగతిలో ప్రవేశం పొందడానికి అర్హులు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “రోడ్లపై అడుక్కునే పిల్లలు, సరైన పాఠశాల వసతి లేని దూర గ్రామాల పిల్లలు, సామాజికంగా వెనుకబడి, సమీపంలోని స్కూల్‌లో అడ్మిషన్ దొరకని బాలికలు, బడులకు వెళ్లలేని పిల్లలకు విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ వర్చువల్ స్కూల్‌ను లాంచ్ చేశాం. ఈ పిల్లలు వర్చువల్ మోడ్‌లో ఇంటి నుంచే విద్యను పొందే అవకాశం ఉంటుంది.’’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : ఇండియన్ స్టూడెంట్స్‌కు రూ.7 కోట్ల 30 లక్షల స్కాలర్‌షిప్ ప్యాకేజ్.. ఆ యూనివర్సిటీ బంపరాఫర్!
వర్చువల్ మోడ్‌లో బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఈ స్కూల్‌లో ఉంటారని కేజ్రీవాల్ తెలిపారు. గూగుల్ , స్కూల్‌నెట్ ఇండియా భాగస్వామ్యంతో రూపొందించిన స్కూలింగ్ ప్లాట్‌ఫామ్ ఉండనుంది. ఇందులో లైవ్ వీడియో, రికార్డ్ వీడియో, డిజిటల్ లైబ్రరీ, యాక్సెస్ మాడ్యూల్స్ అందుబాటులో ఉంటాయి.
వర్చువల్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. విద్యార్థులు సొంతంగా లెర్నింగ్ మెటీరియల్స్‌తో తరగతులకు హాజరుకావచ్చు. లైవ్ తరగతులను తరువాత చూడటానికి ఆర్కైవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తరగతిలో ఏం నేర్చుకున్నారో ఇతర విద్యార్థులతో చర్చించడానికి సబ్జెక్ట్ టీచర్ పర్యవేక్షణలో పాల్గొనవచ్చు. విద్యార్థులు ఆన్-డిమాండ్ ఆధారంగా వన్-ఆన్-వన్ అకడమిక్ మెంటరింగ్ సదుపాయం పొందనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, Career and Courses, EDUCATION, JOBS, Online classes