ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు (AP Police Jobs) సంబంధించి వయోపరిమితిని పెంచుతూ ఇటీవల సీఎం వైఎస్ జగన్ (CM Jagan) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం నిర్ణయం మేరకు తాజాగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మరింత మంది అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ కేటగిరీలో 18 నుంచి 26 ఏళ్ల వరకు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 18 నుంచి 31 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ కేటగిరీలో 21 నుంచి 29 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 21 నుంచి 34 ఏళ్ల వారికి అవకాశం ఉంటుంది. ఇటీవల ఏపీలోని జగన్ ప్రభుత్వం 6100 కానిస్టేబుల్, 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే.. చాలా రోజులుగా నోటిఫికేషన్లు విడుదల కానందున వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగుల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. ఈ మేరకు స్పందించిన సీఎం జగన్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే. . ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి సైతం వయో పరిమితిని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అయినా.. ఇంకా అధికారిక ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS, Police jobs