AP Group-1 Mains: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ నిర్వహణపై APPSC కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సమయంలో ఏపీ గ్రూప్ 1 మెయిన్స్..2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ఉండడంతో..ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కొత్త షెడ్యూల్ కు సంబంధించి వివరాలు వెల్లడించింది. జూన్ 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహిస్తామని ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. కాగా నిన్న UPSC సివిల్ ఇంటర్వ్యూలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
UPSC షెడ్యూల్ రిలీజ్..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ 2022 ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసింది. కమిషన్ విడుదల చేసిన కొత్త ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకారం.. పర్సనాలిటీ టెస్ట్ ఏప్రిల్ 24 నుండి మే 18, 2023 వరకు నిర్వహించబడుతుంది. అయితే అదే సమయంలో ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల వినతి మేరకు ఏపీ గ్రూప్ 1 పరీక్షను జూన్ కు వాయిదా వేసినట్లు ప్రకటించారు.
కాగా ఏపీలో 111 గ్రూప్-1 (Group-1) పోస్టుల భర్తీకి జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC). రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లోని 297 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించారు. మొత్తం 83.38 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారని ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 % మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
జనవరి 10, 2023న ఉదయం 10 గంటలకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించింది. తర్వాత 20 రోజులకు ఫలితాలను ఫలితాలను విడుదల చేసింది. ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆ తరువాత మెయిన్స్ షెడ్యూల్ ను ప్రకటించగా..upsc షెడ్యూల్ రిలీజ్ తో గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేస్తూనే కొత్త తేదీలను ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP Government Jobs, Ap jobs, APPSC, JOBS