జనవరి 08న ఏపీపీఎస్సీ గ్రూప్ 1(APPSC Group 1) పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లోని 297 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 83.38 శాతం హాజరు నమోదు కాగా.. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారని ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 % మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జనవరి 27న ఈ పరీక్షకు సంబంధించి ఫలితాలను విడుదల చేశారు. వీటిలో ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్(Mains) పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరందరూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఏ మాధ్యమంలో రాస్తారు, పోస్టు, జోనల్ ప్రాధాన్యత, ఏ సెంటర్‌లో పరీక్ష రాయాలనుకుంటున్నారు వంటి వివరాలను అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకు సంబంధించిన రేపటి నుంచి అనగా.. మార్చి 06 నుంచి మార్చి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీనిని అధికారిక వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి.. మీ వివరాలను నింపండి.
ఇదిలా ఉండగా.. ఫలితాలు వెల్లడించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించి.. వెంటనే మెయిన్స్ షెడ్యూల్ కూడా ప్రకటించారు.
మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇలా.. ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిలో తెలుగు పేపర్ ఏప్రిల్ 23 నిర్వహించనుండగా.. ఇంగ్లీష్ పేపర్ ఏప్రిల్ 24న నిర్వహించనున్నారు. ఈ రెండు పేపర్లు క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. వీటిలో వచ్చిన మార్కులు మెయిన్స్ మార్కులతో కలపరు.
పేపర్ 1 జనరల్ ఎస్సై పరీక్ష- ఏప్రిల్ 25న. పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ - ఏప్రిల్ 26న, పేపర్ 3 పాలిటీ, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ - ఏప్రిల్ 27న, పేపర్ 4 ఎకానమీ ఇండియా అండ్ ఏపీ - ఏప్రిల్ 28న, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణ సమస్యలు - ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుందని.. ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తామని చైర్మన్ ఇటీవల తెలిపారు. అంతే కాకుండా.. ప్రభుత్వం ఆమోదం లభిస్తే.. ఈ సెప్టెంబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.