సంవత్సరానికి ఒకటో, రెండో వచ్చే నోటిఫికేషన్లకు(Notifications) లక్షల్లో పోటీ ఉంటుంది. వాటి కోసం ప్రిపరేషన్ సాగించి.. తీరా పరీక్ష జరిగిన తర్వాత రద్దు చేస్తే.. అప్పటి వరకు ఆ పరీక్ష (Exam) కోసం కేటాయించిన సమయం, డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఇలానే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్(Notification) విడుదల చేసుకుందామని.. ఆ నోటిఫికేషన్ ను తెలంగాణలో రద్దు చేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో(Andhra Pradesh) వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు రద్దు అవుతున్నాయి. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ డీఎంఈ (DME AP) ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 విభాగాల్లో ఖాళీలను (Jobs) భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం 1458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఆ పొస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా నవంబర్ 19న ముగిసింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, రెస్పీరేటరీ మెడిసిన్, సైకియాట్రి, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ, న్యూరో సర్జరీ, సర్జికల్ ఆంకాలజీతో పాటు మొత్తం 49 విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామక నోటిఫికేషన్ ను హైకోర్డు సస్పెండ్ చేసింది. నియమాక ప్రక్రియలో ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను అనుమతించలేదని కర్నూలుకు చెందిన డాక్టర్ ఝాన్సీ రాణితో పాటు మరికొందరు పిటిషన్ వేశారు. దీనిలో లాయర్ శ్రావణ్ కుమార్.. ఏ కాలేజీలో అయినా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా వాదించాడు. దీనిపై ఏకీభవించిన హైకోర్డు ఈ నోటిఫికేషన్ ను సస్పెండ్ చూస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ ను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్డు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు 17 పోస్టుల కోసం AMVI నోటిఫికేషన్ 2022ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో ప్రశ్నాపత్రం ఇంగ్లీష్‌లోనే ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని తూర్పుగోదావరి జిల్లా వాసి కాశీ ప్రసన్నకుమార్ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రశ్నాపత్రం ఇస్తామనడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పుబట్టారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇలా ఆంధ్రప్రదేశ్ లో నోటిఫికేషన్లు వేసినట్లే వేసి.. రద్దు అవువుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలోనే ఇలాంటి వివాదాలు లేకుండా అధికారులు చూసుకోవాలని.. లేదంటే సమయం, డబ్బు వృధా అవుతుందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Ap jobs, JOBS