కరోనా నేపథ్యంలో మూతబడిన అంగన్ వాడీ కేంద్రాలను ఫిబ్రవరి నుంచి ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 55, 608 అంగన్ వాడీ కేంద్రాలను సకల సదుపాయాలతో ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. ‘నాడు-నేడు’ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. వైఎస్ఆర్ ప్రైమరీ-1, వైఎస్ఆర్ ప్రైమరీ-2, వైయస్ ఆర్ ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు ఈ అంగన్ వాడీ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ మొత్తం 55,608 కేంద్రాల ద్వారా 3 నుంచి 6 ఏళ్ల వయసున్న దాదాపు తొమ్మిది లక్షల మంది పిల్లలకు అన్ని వసతులతో కూడిన ప్రీ స్కూల్ విద్యా బోధనను అందించడానికి ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ స్కూళ్లలో అత్యంత నాణ్యతతో కూడిన పౌష్ఠికాహారంతో పాటు శుద్ధి చేసిన మంచి నీరు అందించనున్నారు. చిన్నారులకు కంఫర్ట్ గా ఉండేలా మంచి ఫర్నీచర్ కు కూడా ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఏర్పాటు చేశారు. అంగన్ వాడీల రూపు రేఖలు మార్చడానికి ప్రభుత్వం
రూ. 4 వేల కోట్లను కేటాయించింది.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఇకపై స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా గ్రామసచివాలయాలనే రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.., గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తైన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు.
గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనితీరును స్వయంగా చూసి నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బందికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిబంధనల ప్రకారం చేసే అవకాశం సిబ్బందికి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Published by:Nikhil Kumar S
First published:January 20, 2021, 21:19 IST